పిల్లలకు స్మార్ట్​ ఫోన్లు ఇచ్చేయకండి.. సైబర్​ నేరగాళ్లు కాచుకొని ఉన్నారు..

Update: 2020-11-10 01:30 GMT
‘మా అబ్బాయి సెకండ్​ క్లాస్​ చదువుతున్నాడండీ.. ఆన్ లైన్​లో కోడింగ్​ క్లాసులు కూడా నేర్పిస్తున్నాము. స్మార్టు ఫోన్లు వాడటమంటే మా వాడికి వెన్నతో పెట్టిన విద్య. యాప్​లు డౌన్​లోడ్​ చేస్తాడు. గేమ్స్​ ఆడతాడు. యూట్యూబ్​ చూస్తాడు.’ ఈ తరహాలో గొప్పలు చెప్పే తల్లిదండ్రుల సంఖ్య ఇటీవల పెరిగిపోతున్నది. అయితే పిల్లలు స్మార్ట్​ ఫోన్లు వాడటాన్ని గొప్పగా భావించవద్దని.. తల్లిదండ్రులు పక్కన ఉన్నప్పుడు మాత్రమే వాళ్లకు స్మార్ట్​ ఫోన్లు ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల చిన్నపిల్లాడు తన తండ్రి మొబైల్​ ఫోన్​ వాడి అకౌంట్లోని రూ. 9 లక్షల రూపాయలు పోగొట్టాడు. నాగ్ పూర్ ఈ సైబర్ మోసం వెలుగుచూసింది. నాగపూర్ కు చెందిన అశోక్ మన్వాటే వ్యాపారవేత్త. అయితే అతడి 15 ఏళ్ల కుమారుడు తరచూ తండ్రి స్మార్ట్​ ఫోన్​ను వాడుతుంటాడు. ఆన్​లైన్​ క్లాసులు ఉండటంతో తండ్రి కూడా కుమారుడికి ఫోన్​ ఇస్తున్నాడు. అందులో గేమ్స్ ఆడడం, సరదా యాప్స్ డౌన్ లోడ్ చేయడం లాంటివి చేస్తుంటాడు.

ఓ రోజు కుమారుడి చేతిలో ఫోన్​ ఉన్నప్పుడు.. సైబర్​ నేరగాడు ఫోన్​చేశాడు. కస్టమర్​ కేర్​ నుంచి మాట్లాడుతున్నామని.. ఫలానా యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలని చెప్పాడు. ఆ కుర్రాడు సైబర్​ నేరగాడు చెప్పినట్టు ఫాలోఅయ్యాడు. ఇంకేముంది నిమిషాల్లోనే వ్యాపారి అకౌంట్లో ఉన్న డబ్బంతా మాయం అయ్యింది. అశోక్ ఖాతా నుంచి ఏకంగా 9 లక్షల రూపాయలు ట్రాన్స్​ఫర్​ అయ్యాయి. విషయం తెలుసుకున్న అశోక్ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రిమోట్ డెస్క్టాప్ సాఫ్ట్ వేర్ ఆధారంగా సైబర్ మోసగాడు.. ఎకౌంట్ ను యాక్సెస్ చేసి డబ్బులు కొల్లగొట్టినట్టు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్​ఫోన్లు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. నిరంతరం పర్యవేక్షణలో ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో తల్లిదండ్రుల ఫోన్లు పిల్లల వద్ద ఉండటంతో సైబర్​ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
Tags:    

Similar News