యూట్యూబ్‌ వీడియోకు లైక్, షేర్‌.. రూ.కోటికి బండ!

Update: 2023-07-06 17:32 GMT
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అంతకంతకూ నేరాలు కూడా అంతే స్థాయి లో పెరుగుతున్నాయి. టెక్నాలజీ ని వినియోగించుకుని సైబర్‌ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇలాంటి మోసాల కు సంబంధించి నిత్యం మీడియా లో వార్తలు వస్తున్నా, పోలీసులు, సైబర్‌ డిపార్టమెంట్‌ అవగాహన కల్పిస్తున్నా కొంతమంది ప్రజలు మారడం లేదు. అత్యాశకు పోయి నిండా మునుగుతున్నారు. ఇప్పుడు ఇలాగే హైదరాబాద్‌ ముగ్గురు వ్యక్తులు రూ.కోటి రూపాయలు సైబర్‌ నేరగాళ్ల కు సమర్పించుకోవాల్సి వచ్చింది.

ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే... ఓ వ్యక్తికి ఇనస్టాగ్రామ్‌ ద్వారా కొందరు పరిచయమయ్యారు. తమ వద్ద పార్ట్‌ టైమ్‌ జాబ్‌ ఉంది చేస్తారా అని అడిగారు. తమ యూట్యూబ్‌ వీడియోల కు లైకులు, షేర్లు కొట్టడంతోపాటు కామెంట్లు చేయడమే పని అని తెలిపారు. ఇదేం పెద్ద పని అనుకున్న బాధితుడు వారు చెప్పిన పనికి అంగీకరించాడు.

ఈ క్రమం లో బాధితుడి మొబైల్‌ కు నిందితులు ఒక యూట్యూబ్‌ లింక్‌ ను పంపారు. దీంతో బాధితుడు ఆ లింక్‌ ను ఓపెన్‌ చేసి ఆ వీడియో ను లైకు చేశాడు. అలాగే ఆ లింక్‌ ను మరింత మందికి షేర్‌ చేశాడు. ఆ వీడియో కింద కామెంట్‌ కూడా పెట్టాడు.

దీంతో సైబర్‌ నేరగాళ్లు బాధితుడి ఖాతా కు కొంత మొత్తం నగదు చెల్లించారు. ఇక బాధితుడికి పూర్తి స్థాయిలో నమ్మకం కలిగింది. ఇలా కొద్ది రోజులు గడిచాక తమ కంపెనీ లో పెట్టుబడి పెడితే ఆ మొత్తం డబుల్‌ అవుతుందని నమ్మబలికారు. సైబర్‌ నేరగాళ్ల మాటలు నమ్మిన బాధితుడు పలు విడతలుగా రూ.53 లక్షలు పెట్టుబడి పెట్టాడు.

ఇక అప్పటి నుంచి సైబర్‌ నేరగాళ్లు బాధితుడికి ఫోన్‌ చేయడం, చాట్‌ చేయడం మానేశారు. దీంతో తాను నిండా మునిగిపోయాయ ని తెలుసుకున్న బాధితుడు లబోదిబోమంటూ పోలీసుల కు ఫిర్యాదు చేశాడు.

అచ్చం ఇదేవిధంగా హైదరాబాద్‌ లోనే మరో వ్యక్తి రూ.36 లక్షలు, బిట్‌ కాయన్‌ ట్రేడింగ్‌ పేరుతో మరో యువకుడు రూ.18 లక్షలు పోగొట్టుకున్నట్లు పోలీసుల కు ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే నగరంలో పలువురు ఇలాంటి తరహా మోసాలకే బలయ్యారు. అయినా ఇంకా చాలామందిలో మార్పు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికైనా ముక్కుముఖం తెలియనివారి నుంచి వచ్చే లింకుల ను ఓపెన్‌ చేయొద్దని.. బ్యాంకు ఖాతాల వివరాలు, డెబిట్, క్రెడిట్‌ కార్డులు, పిన్, ఓటీపీలు చెప్పొద్దని సూచిస్తున్నారు.

Similar News