షాక్‌: 2014 ఎన్నిక‌ల్లో మోడీ విజ‌యం అలానా?

Update: 2019-01-22 04:32 GMT
షాకింగ్ లాంటి సంచ‌ల‌నం ఒక‌టి ప్రెస్ మీట్ రూపంలో ప్ర‌పంచానికి బ‌ట్ట‌బ‌య‌లైంది. అయితే.. ఇందులో నిజం ఎంత‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. 2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించ‌టం తెలిసిందే. అయితే.. ఈ గెలుపు వెనుక ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రిగిందంటూ సయ్యద్‌ సుజా అనే సైబ‌ర్ నిపుణుడు వెల్ల‌డించ‌టం ఇప్పుడు షాకింగ్ గా మారింది. రెండు రోజుల క్రితం త‌న‌పై దాడి జ‌రిగింద‌న్న ఆయ‌న‌.. మీడియా స‌మావేశానికి రాకుండా స్కైప్ కాల్ తో తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పారు.

తొలుత ప్రెస్ మీట్ ఉంటుంద‌ని.. ఈవీఎంల‌ను ఎలా ట్యాంప‌రింగ్ చేయొచ్చ‌న్న విష‌యాన్ని వెల్ల‌డిస్తార‌ని ఆయ‌న పేర్కొన్న‌ప్ప‌టికీ.. వీడియో కాల్ తో స‌రిపెట్టారు. ఈవీఎంల‌ను ఎలా ట్యాంప‌రింగ్ చేయొచ్చ‌న్న విష‌యాన్ని ఆయ‌న చేత‌ల్లో చేసి చూపించ‌లేదు. లండ‌న్ లో జ‌రిగిన ఈ ప్రెస్ మీట్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. హాట్ టాపిక్ అయ్యింది.

2014లో జ‌రిగిన ఎన్నిక‌ల సంద‌ర్భంగా వినియోగించిన ఈవీఎంలు త‌క్కువ పౌనఃపున్యం ఉన్న సిగ్న‌ల్స్ ను విడుద‌ల చేసేద‌ని.. దాని ద్వారా హ్యాక్ చేసిన‌ట్లుగా ఆయ‌న ఆరోపించారు. ఈవీఎంలు విడుద‌ల చేసే లో ఫ్రీక్వెన్సీ మిల‌ట‌రీ గ్రేడ్ సిగ్న‌ల్స్ ను అనిల్ అంబానీ సంస్థ రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్స్ అంద‌జేసిన‌ట్లు చెప్పారు. అయితే.. ఈ మాస్ట‌ర్ ప్లాన్ స్కెచ్ మొత్తానికి హైద‌రాబాద్ లోని ఈసీఐఎల్ వేదిక అయిన‌ట్లుగా చెప్పారు.

ఈవీఎంల‌ను సులువుగా హ్యాకింగ్ చేయ‌టానికి వీలుగా ఈసీఐఎల్ లో ప్లాన్ చేశార‌ని.. ఇందులో బీజేపీ లాభం పొందిన‌ట్లుగా చెప్పారు. ఈవీఎంల‌పై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్న ప్ర‌తిప‌క్షాలు.. బ్యాలెట్ విధానంలో రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాలంటూ డిమాండ్ చేస్తున్న వేళ‌.. స‌య్య‌ద్ సుజా వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లాన్ని రేపుతున్నాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత నిర్వ‌హించిన ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ పైనా ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈవీఎంల‌ను హ్యాక్ చేయ‌వ‌చ్చ‌న్న విష‌యం బీజేపీకి బాగా తెలుస‌ని.. దీన్ని పూర్తి స్థాయిలో ఉప‌యోగించ‌టం కార‌ణంగా 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజ‌యం సాధించింద‌ని..ఈవీఎంల‌ ట్యాంప‌రింగ్ కార‌ణంగా కాంగ్రెస్ 200 సీట్ల‌ను కోల్పోయిన‌ట్లుగా పేర్కొన్నారు. నాటి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈసీగా వ్య‌వ‌హ‌రించిన సంప‌త్ కు ఈవీఎంల ట్యాంప‌రింగ్ గురించి తెలుస‌ని.. హ్యాకింగ్ ను న‌డిపించిన రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్స్ కు దేశ వ్యాప్తంగా తొమ్మిది కేంద్రాలు ఉన్నాయ‌ని.. అందులో ప‌ని చేసే ఉద్యోగుల‌కు విష‌యం తెలుసంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చేసిన‌ట్లుగా 2015లో జ‌రిగిన ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఈవీఎంల‌ను హ్యాక్ చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని.. కానీ తాము అడ్డుకోవ‌టంతో ఆమ్ ఆద్మీ పార్టీ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన‌ట్లుగా పేర్కొన్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లతో పాటు.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేసి విజ‌యం సాధించిన‌ట్లుగా చెప్పారు.

ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేసే విష‌యం బీజేపీ నేత గోపీనాథ్ ముండేకి తెలుస‌ని.. ఆయ‌న్ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకొన్న 15 రోజుల‌కే హ‌త్య చేసిన‌ట్లుగా ఆరోపించారు. ఇటీవ‌ల జ‌రిగిన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్థాన్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్ ల‌లో జ‌రిగి ఎన్నిక‌ల్లోనూ ఈవీఎంల‌ను హ్యాక్ చేసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తే.. తాము అడ్డుకున్నామ‌న్నారు. క‌ర్ణాట‌క‌కు చెందిన ఉద్య‌మ నేత క‌మ్ జ‌ర్న‌లిస్ట్ గౌరీ లంకేశ్ హ‌త్య వెనుక కూడా ఇదే విష‌యం ఉంద‌న్నారు. ఈవీఎంల‌ను హ్యాక్ చేసేందుకు అవ‌కాశం ఉన్న వైనాన్ని బ‌య‌ట‌పెట్టేందుకు ఆధారాల కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. అందుకే ఆమెను హ‌త్య చేసిన‌ట్లుగా పేర్కొన్నారు. ఇలా సంచ‌ల‌నాల మీద సంచ‌ల‌నాల్ని పేర్కొంటూ షాకింగ్ వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి.. దీనిపై ఈసీఐఎల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.




Full View

Tags:    

Similar News