సైబ‌ర్ ట‌వ‌ర్స్.. వాజ్ పేయ్ చేత‌ల మీదుగా!

Update: 2018-08-17 04:39 GMT
హైద‌రాబాద్ అన్నంత‌నే చార్మినార్ గుర్తుకు వ‌స్తుంది. అది కాకుండా అంటే అంద‌రి నోట వినిపించే మాట ఐటీ. దానికి ఐకాన్ గా నిలుస్తుంది హైటెక్ సిటీ.. కూడ‌లిలో నిలువెత్తుగా క‌నిపించే సైబ‌ర్ ట‌వ‌ర్స్. తెలుగోడి ఐటీ విజ‌యానికి అదో ప్ర‌తీక‌. ప్ర‌పంచంలో భార‌త ఐటీ రంగానికి ఒక గుర్తింపు ఉంటే.. ఆ క్రెడిట్ లో భాగంగా సైబ‌ర్ ట‌వ‌ర్స్ ను ప్ర‌స్తావించ‌క త‌ప్ప‌దు.

మ‌రి.. అలాంటి ఐకానిక్ ట‌వ‌ర్ ఎవ‌రి చేతుల మీదుగా స్టార్ట్ అయ్యిందో తెలుసా?  ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రించి.. త‌న పాల‌న‌లో దేశానికి స‌రికొత్త తోవ చూపించిన వాజ్ పేయ్ హ‌యాంలోనే. దేశ ప్ర‌ధానిగా వాజ్ పేయ్ తెలుగు ప్రాంతానికి సుప‌రిచితుడు. ఆయ‌న‌కు ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రంతో ప్ర‌త్యేక అనుబంధం ఉంది. దేశ ప్ర‌ధాని హోదాలో ఆయ‌న నాలుగుసార్లు  హైద‌రాబాద్‌ కు వ‌చ్చారు.

వాజ్ పేయ్ హ‌యాంలో కీల‌క‌మైన ప్రాజెక్టులకు అడుగులు ప‌డితే.. మ‌రికొన్ని పూర్తి అయ్యాయి. తెలుగు రాష్ట్రాల ఐటీకి ల్యాండ్ మార్క్ గా నిలిచే హైటెక్ సిటీ సైబ‌ర్ ట‌వ‌ర్స్ ప్రారంభోత్స‌వం వాజ్ పేయ్ చేతుల మీదుగానే జ‌రిగింది. పేద‌ల‌కు గృహాలు అందించే వాంబే ప‌థ‌కంతో పాటు.. ఏషియ‌న్ క్రీడ‌ల ముగింపుతో హైద‌రాబాద్ కు ఈ రోజున త‌ల‌మానికంగా మారిన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన కీల‌క నిర్ణ‌యం వాజ్ పేయ్ హ‌యాంలోనే సాగింది.

ఇక‌.. ప్ర‌జార‌వాణాకు సంబంధించి హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఎంఎంటీఎస్ పై సానుకూలంగా నిర్ణ‌యం తీసుకున్న ఘ‌న‌త కూడా వాజ్ పేయ్ సొంతం. అంతేనా.. 2000 జూన్లో ఇండో-అమెరిక‌న్ కేన్స‌ర్ ఇన్ స్టిట్యూట్.. రీసెర్చ్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వానికి వాజ్ పేయ్ హాజ‌ర‌య్యారు.

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర అభివృద్ధి విష‌యంలో వాజ్ పేయ్  పాత్ర ఒక ఎత్తు అయితే.. త‌న రాజ‌కీయ మిత్రుడికి సంబంధించి కీల‌క స‌మ‌యాల్లో వ‌చ్చి అండ‌గా నిల‌బ‌డిన వైనం వాజ్ పేయ్ లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంది. ఎన్టీఆర్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టిన ఇందిర‌మ్మ నిర్ణ‌యానికి నిర‌స‌న‌గా.. ఎన్టీఆర్ అప్ప‌ట్లో చేప‌ట్టిన కార్య‌క్ర‌మానికి.. వాజ్ పేయ్ అండ‌గా నిల‌వ‌ట‌మే కాదు.. హైద‌రాబాద్ కు వ‌చ్చి ఎన్టీవోడితో నిలిచారు. అనంత‌రం ప్ర‌జాగ్ర‌హంతో మెట్టుదిగిన ఎన్టీఆర్ ను మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని చేస్తూ నిర్ణ‌యం తీసుకోగా.. నాటి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ మ‌హోత్స‌వానికి వాజ్ పేయ్ హాజ‌ర‌య్యారు.

ఇలా హైద‌రాబాద్ తో వాజ్ పేయ్ అనుబంధం ఎక్కువే. ఇదంతా ఒక ఎత్తు అయితే పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా కొన‌సాగిన 1980-86 మ‌ధ్య‌కాలంలో హెగ్డేవార్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్నారు. క‌ర్ణాట‌క‌కు వెళుతూ.. ఈ విష‌యాన్ని తెలుసుకున్న వాజ్ పేయ్.. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఆగి.. వెంట‌నే విమానం దిగేశారు. విమానాశ్ర‌యం నుంచి నేరుగా కారులో స‌భాప్రాంగ‌ణానికి వెళ్లి పార్టీ నేత‌ల్ని ఆశ్చ‌ర్య‌చ‌కితుల్ని చేశారు.
Tags:    

Similar News