బెంగ‌ళూరులోనూ ఐటీ గ్రిడ్స్ కార్య‌క‌లాపాలు?

Update: 2019-03-04 09:10 GMT
ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పెను దుమారానికి తెర‌లేపింది ఐటీ గ్రిడ్స్ సంస్థ. రాష్ట్ర ప్ర‌జ‌ల ఆధార్‌ - ఓట‌ర్ ఐడీ - బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను సంస్థ సేక‌రించింద‌ని.. అధికార టీడీపీకి వాటిని అంద‌జేసింద‌ని వెల్లువెత్తుతున్న ఆరోప‌ణ‌లు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ఈ ఆరోప‌ణ‌ల‌పై తెలంగాణ పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించ‌డం మ‌రింత క‌ల‌క‌లానికి కార‌ణ‌మ‌వుతోంది.

ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేస్తోంది. టీడీపీ పార్టీకి చెందిన అధికార యాప్ ‘సేవామిత్ర’ ను రూపొందించింది ఈ సంస్థే. అయితే - స‌ద‌రు యాప్‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా రాష్ట్ర ప్ర‌జ‌ల ఆధార్‌ కార్డు - ఓటర్‌ ఐడీ - బ్యాంకు ఖాతా - వ్యక్తిగత వివరాలను అనుసంధానం చేశార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. వాస్త‌వానికి జిల్లా క‌లెక్ట‌ర్ల ప‌రిధిలో ర‌హ‌స్యంగా ఉండాల్సిన ఆ వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని సేక‌రించి పార్టీ యాప్ లో ఎక్కించ‌డం డేటా చౌర్యం కింద‌కే వ‌స్తుంది.

ఈ వ్య‌వ‌హారంపై ఫిర్యాదులు అంద‌డంతో ఐటీ గ్రిడ్స్ కంపెనీపై సైబ‌రాబాద్ పోలీసులు దృష్టిసారించారు. హైద‌రాబాద్ లో కొండాపూర్ - కేపీహెచ్‌ బీ కాలనీల్లోని ఆ సంస్థ కార్యాల‌యాల్లో సోదాలు నిర్వ‌హించారు. ప‌లు హార్డ్ డిస్క్ ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌స్తుతం వాటిని డీకోడ్ చేసే ప‌నిలో పోలీసులు ఉన్నారు. వాటిలోని స‌మాచారం బ‌య‌ట‌ప‌డితే అస‌లు డేటా చౌర్యం జ‌రిగిందో లేదో స్ప‌ష్టంగా తెలిసిపోనుంది.

ఇదిలా ఉండ‌గా ఐటీ గ్రిడ్స్ కంపెనీ గురించి తాజాగా మ‌రో కీల‌క విష‌యం ప్ర‌చారంలోకి వ‌స్తోంది. ఈ సంస్థ కేవ‌లం హైద‌రాబాద్ కు ప‌రిమితమైన‌ది కాద‌ని తెలుస్తోంది. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగూళ‌రు కేంద్రంగా కూడా ఐటీ గ్రిడ్స్ కార్య‌క‌లాపాలు కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం. దీంతో సైబ‌రాబాద్ పోలీసులు ప్ర‌స్తుతం బెంగ‌ళూరు పోలీసుల‌ను సంప్ర‌దించే యోచ‌న‌లో ఉన్నార‌ట‌. బెంగళూరులోనూ కంపెనీ కార్య‌క‌లాపాలు వాస్త‌వ‌మేన‌ని తేలితే..

అక్క‌డికి వెళ్లి సోదాలు నిర్వ‌హించాల‌ని వారు భావిస్తున్నార‌ట‌. అదే జ‌రిగితే డేటా చౌర్యం కేసుకు సంబంధించి మ‌రిన్ని ఆధారాలు దొరికే అవ‌కాశ‌ముంది.

మ‌రోవైపు - డేటా చౌర్యం కేసు ద‌ర్యాప్తులో ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ పోలీసుల‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. ఆదివారం త‌మ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసును ఆయ‌న ధిక్క‌రించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అశోక్ విచార‌ణ‌కు హాజ‌రైతే.. బెంగ‌ళూరు కేంద్రంగా కార్య‌క‌లాపాలు వాస్త‌వ‌మేనా? కాదా? అనే సంగ‌తిలో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని పోలీసులు చెబుతున్నారు. ఇంకా ఏయే న‌గ‌రాల్లో ఐటీ గ్రిడ్స్ ప‌నిచేస్తోందో తెలుసుకోవ‌డంపై తాము దృష్టి పెట్టిన‌ట్లు వారు వెల్ల‌డించారు.


Tags:    

Similar News