డీఎస్ కొడుకు అడుగుల‌న్నీ ఆ పార్టీవైపేనా?

Update: 2017-08-16 04:53 GMT
నేత‌లు తీసుకునే కొన్ని నిర్ణ‌యాలు వారి ఇమేజ్ ను పూర్తిగా మార్చేస్తుంటాయి. ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన నేత‌లు.. కాల‌క్ర‌మంలో ఎలా అయిపోతార‌న‌టానికి టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు డి శ్రీనివాస్ నిలువెత్తు నిద‌ర్శ‌నం. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయ‌న‌.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం అధికార‌పార్టీవైపు మొగ్గు చూప‌టం.. టైం చూసుకొని చేతిని వ‌దిలేసి గులాబీ కారును ఎక్కేయ‌టం తెలిసిందే.

కారు ఎక్కినందుకు రాజ్య‌స‌భ  స‌భ్యత్వం ద‌క్కిన‌ప్ప‌టికీ ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న లాంటి నేత‌ను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప‌క్క‌న పెట్టేయ‌టంపై ఆయ‌న గుర్రుగా ఉన్నార‌ని.. అయితే ఏమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్లుగా చెబుతారు. ఇదే స‌మ‌యంలో కారును వ‌దిలేసి చేతి చెంత‌కు చేరిపోతార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ఈ వాద‌న‌లో ఎలాంటి నిజం లేద‌న్న ఖండింపులు డీఎస్ చేస్తున్నారు. తాను టీఆర్ ఎస్ వ‌దిలేసి కాంగ్రెస్ లో చేర‌తానంటూ రాస్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని.. అలాంటి వార్త‌ల‌పై లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకుంటాన‌ని ఆయ‌న హెచ్చ‌రిస్తున్న వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలా ఉంటే.. డీఎస్ పార్టీ మార్పుపై మాత్రం ప్ర‌చారం ఒక ప‌ట్టాన ఆగ‌ని ప‌రిస్థితి. కాంగ్రెస్ లో చేరే విష‌యం మీద డీఎస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారే కానీ.. పార్టీ మార‌తార‌న్న ప్ర‌చారాన్ని ఆయ‌న కొట్టి పారేయ‌టం లేద‌న్న ఆస‌క్తిక‌ర వాద‌న‌ను కొంద‌రు వినిపిస్తున్నారు. ఈ వాద‌న‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి ఈ మ‌ధ్య‌న త‌ర‌చూ వినిపిస్తోంది. దీనికి తోడు తాజాగా ఒక ఫ్రూప్ అన్న‌ట్లుగా ఒక యాడ్‌ ను చూపిస్తున్నారు.

డీఎస్ కుమారుడు ధ‌ర్మ‌పూడి అర‌వింద్ తాజాగా ప్ర‌ధాని మోడీని పొడిగేస్తూ ఫుల్ పేజీ యాడ్ ను ప‌త్రిక‌ల‌కు ఇవ్వ‌టాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. మోడీ నాయ‌క‌త్వాన్ని ప్ర‌జ‌లు దీర్ఘ‌కాలం స‌మ‌ర్థిస్తార‌న్న సందేశాన్ని ఆయ‌న  ఆ ప్ర‌క‌ట‌న‌లో చెప్ప‌టం చూస్తే.. డీఎస్ కుమారుడు అడుగులు క‌మ‌లం దిశ‌గా ప‌య‌నిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. మోడీకి సంబంధించి టీఆర్ ఎస్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైనం తెలిసిందే. కొన్ని అంశాల్లో మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు క‌నిపించినా.. బీజేపీతో త‌మ‌కు రాజ‌కీయ వైరం ఉంద‌న్న విష‌యాన్ని గుర్తు చేసేలా కేసీఆర్ ప‌లు వ్యాఖ్య‌లు చేయ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఇందుకు భిన్నంగా డీఎస్ కొడుకు తీరు ఉండ‌టాన్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నిజామాబాద్ బీజేపీ అభ్య‌ర్థిగా డీఎస్ కుమారుడు డి. అవినాష్ ఎంపిక ఉంటుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఒక‌వేళ కొడుక్కి బీజేపీ సీటు వ‌చ్చేస్తే.. అన్ని చూసుకొని డీఎస్ కూడా బీజేపీలోకి వెళ్లిపోవ‌చ్చ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఇందులో నిజం పాళ్లు ఎంత‌న్న‌ది కాల‌మే తేల్చాలి.
Tags:    

Similar News