అనకాపల్లిలో ఆసక్తికర రాజకీయం..

Update: 2019-02-28 05:00 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయంలో అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గం అనకాపల్లి. ఈ నియోజకవర్గంలోని కొణతాల రామకృష్ణ - దాడి వీరభద్రరావు ఇద్దరు సీనియర్‌ నేతలే. ఇద్దరు మాజీ మంత్రులే. వీరిద్దరిని టీడీపీ - వైసీపీలు రారమ్మంటూ పిలుస్తున్నాయట. కానీ వారిద్దరు తమ మనసులో ఏం ఉందో చెప్పడం లేదట. నిశ్శబ్ద వ్యూహాన్ని మాత్రమే పాటిస్తున్నారట. ఎన్నికల దగ్గరపడుతున్న వేళ వీరి మౌనం వెనుక ఉన్న కారణాల ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు - శాశ్వత శత్రువులు ఉండరంటారు. కానీ ఏపీలో కొణతాల - దాడిల మధ్య నిత్యం ఫైర్‌ నడుస్తూనే ఉంటుంది. ఇద్దరికి రాజకీయం చేసే సత్తా మాత్రమే కాదు దూకుడుగా వ్యవహరించే మాస్‌ ఇమేజ్‌ కూడా ఉంది. ఇద్దరు ఒకే సామాజిక వర్గం. కానీ ఇద్దరికీ క్షణం కూడా పడదు. తొలి నుంచి ఉత్తర - దక్షిణ ద్రువాలు అన్నట్లుగానే రాజకీయం చేస్తున్నారు. అలాంటి నేతలు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. ఎందుకని ఆరా తీస్తే..

తమ ప్రత్యర్థి ఏ పార్టీలో చేరుతాడో చూసి.. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలో చేరాలని ఇద్దరు అనుకుంటున్నారట. కొణతాల ఏ పార్టీలో చేరుతాడోనని దాడి ఎదురుచూస్తుంటే... దాడి ఏ పార్టీలో చేరుతాడోనని కొణతాల ఎదరుచూస్తున్నారట. ఇంత బద్ధ శత్రుత్వం ఉన్న వీరిద్దరు వైసీపీలో కొన్నాళ్లు కొనసాగారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఉండవన్న సంగతి వీరికి తెలియంది కాదు. అందుకే వైసీపీ నుంచి వారు బయటికి వచ్చారు. ప్రస్తుతం ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఇద్దరిని అటు టీడీపీ - మళ్లీ తిరిగి వైసీపీ ఆహ్వానిస్తున్నాయట.

కానీ తమ శత్రువు ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ ప్రత్యర్థి పార్టీలో చేరాలని ప్రస్తుతం వీరిద్దరూ సైలెంట్‌ గా ఉన్నారట. ఈ నేపథ్యంలో కొణతాల మైండ్‌ గేమ్‌ కూడా మొదలు పెట్టాడట.. ఆ మధ్య టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన దాడి మళ్లీ వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారట. అయితే కొణతాల కూడా వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం చేశారట. దీంతో దాడి వైసీపీ వైపు చూడడం మానేశారట.

అయితే ఎన్నికలకు ఎన్నో రోజులు లేనందున కొణతాల తొందరపడుతున్నారు. టీడీపీలో చేరడం ఖాయమంటున్నారు. ఇప్పటికే అనుచర వర్గంతో పార్టీ అధినేతతో సమావేశమయ్యారట. దీంతో దాడి కూడా  వైసీపీ వైపు వేగంగా అడుగులు వేయడం ఖాయమని అంటున్నారు. ఇప్పటి దాకా ఇద్దరు ఎటూ తేల్చుకోకపోవడంతో వారి అనుచర వర్గాల్లో అయోమయం నెలకొంది.  ఇకనైనా వారు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే చాలంటున్నారు.


Tags:    

Similar News