ఈ ఉత్త‌రాంధ్ర సీనియ‌ర్ల భ‌విష్య‌త్తేంటి?

Update: 2018-12-23 04:12 GMT
దాడి వీరభద్రరావు - కొణతాల రామకృష్ణ - సబ్బం హరి...ముగ్గురు విశాఖ జిల్లా రాజకీయాలను శాసించారు. ముగ్గురికి అనకాపల్లితో విడదీయరాని అనుబంధం ఉంది. అనకాపల్లి నుంచే జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అలాంటి నేత‌లు ఇప్పుడు త‌మ భ‌విష్య‌త్ వెతుక్కోవ‌డంలో బిజీ అయిపోయారు. నాలుగున్నరేళ్లు గడిచిపోయాయి. జిల్లా రాజకీయాలను శాసించిన ముగ్గురు నేతలూ...ఎన్నికలు ముంచుకొస్తుండటంతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. సీనియర్ నేతలు కావడం...రాజకీయాల్లో పట్టు ఉండటంతో...తమ పార్టీలో చేరాలంటూ ఆహ్వానిస్తున్నాయి.

సీనియ‌ర్ నేత అయిన వీరిలో దాడి వీరభద్రరావు విశాఖ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. లెక్చరర్‌ గా కెరీర్‌ ప్రారంభించి...ఎన్టీఆర్‌ పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు పర్యాయాలు మంత్రిగా పోలిట్‌ బ్యూరో సభ్యుడిగా పని చేశారు. 2009 ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఎమ్మెల్సీగా పార్టీ అవకాశమిచ్చింది . ఆ తర్వాత శాసన మండలి విపక్ష నేతగా టీడీపీ వాణిని బలంగా వినిపించారు. ఆ తర్వాత వైసీపీలో చేరి కొడుకు రత్నాకర్‌కు టికెట్‌ ఇప్పించుకున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తనయుడు దాడి రత్నాకర్‌ ఓటమి చెందడంతో రాజకీయాలకు దాడి వీరభద్రరావు దూరంగా ఉన్నారు.

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ వెలుగు వెలిగారు. వైఎస్‌ కేబినెట్‌ లో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పని చేశారు. వైఎస్ మరణం తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో కొణతాల రామకృష్ణ కీలకంగా వ్యవహరించారు. 2014లో తన అనుచరులు కిడారి సర్వేశ్వరరావు - గండి బాబ్జీలకు టికెట్లు ఇప్పించుకున్నారు. ఆ తర్వాత జగన్‌ తో వచ్చిన విభేదాల కారణంగా వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఏ పార్టీలో చేరకుండా ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఆయ‌న టీడీపీతో ట‌చ్‌ లో ఉన్నార‌నే టాక్ ఉంది.

ఇక మాజీ ఎంపీ సబ్బంహరి కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడు. విశాఖ మేయర్‌ గా - అనకాపల్లి ఎంపీగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొణతాల - సబ్బంకు అసలు పడేదికాదు. ఇద్దరికి పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉండేది. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్‌ లో ఉంటూనే జగన్‌ కు జై కొట్టారు. సమైక్యాంధ్ర తరపున బరిలోకి దిగినా...చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పకున్నారు. అప్పటి నుంచి ఏ పార్టీలో చేరకుండా సైలెంట్‌ గా ఉన్నారు.

రాజ‌కీయ‌వ‌ర్గాల విశ్లేష‌ణ ప్ర‌కారం దాడి వీరభద్రరావుకు .జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆహ్వానం పలికారు. ఆయ‌న ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదు.  కొణతాల అటు టీడీపీ - ఇటు వైసీపీ నేతలతో టచ్‌ లో ఉన్నారు. కొణతాలను పార్టీలోకి మళ్లీ తీసుకొచ్చేందుకు జగన్‌ ప్రయత్నాలు చేస్తుంటే ఆయన రాకను పార్టీలోని కొందరు వ్యతిరేకిస్తున్నారు. సబ్బంహరి బీజేపీ - టీడీపీ నేతలతో టచ్‌ లో ఉన్నారు. విశాఖ నుంచి పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మరీ ముగ్గురు నేతలు  ఏ పార్టీలోకి వెళతారు ? ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియాలంటే ఏపీలో ఎన్నిక‌ల సంద‌డి మ‌రింత వేడెక్కే వర‌కు వేచి చూడాల్సిందే!
Tags:    

Similar News