దాద్రిలోనూ పిల్ల పిశాచి

Update: 2015-12-24 04:53 GMT
ఇప్పటివరకూ దారుణ అత్యాచారాలకు సంబంధించిన ఉదంతాల్లో మైనర్ల పాత్ర వెలుగులోకి వస్తే.. తాజాగా హత్య ఉదంతంలోనూ పిల్ల పిశాచిపాత్ర బయటకు వచ్చింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దాద్రి ఘటనలోనూ ఒక మైనర్ హస్తం ఉందన్న విషయం వెల్లడైంది. దారుణ నేరాలకు పాల్పడే మైనర్ల వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గిస్తూ రాజ్యసభలో బిల్లు ఆమోదముద్ర పడిన సమయంలోనే దాద్రి నిందితుల్లో మైనర్ ఉన్నారన్న విషయం వెల్లడైంది.

ఉత్తరప్రదేశ్ లోని దాద్రిలో మహ్మద్ అఖ్లాక్ అనే ముస్లిం వ్యక్తి ఆవు మాంసం వండుకున్నారన్న కారణంతో అతని ఇంటిపై 200 మంది వరకూ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అఖ్లాక్ మరణించగా.. అతని కుమారుడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెనుసంచలనాన్ని సృష్టించింది. చివరికి ఇదో పెద్ద ఇష్యూగా మారింది. రాజకీయంగా పెను ప్రకంపనలకు కారణమైంది. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

200 వరకు దాడికి పాల్పడిన ఈ ఘటనలో కేవలం 15 మంది మీద మాత్రమే ఛార్జ్ షీట్ దాఖలైంది. ఈ 15 మందిలో ఒకరు మైనర్ కావటం గమనార్హం. దారుణ నేరాలకు పాల్పడే మైనర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న చర్చ ఓవైపు తీవ్రస్థాయిలో సాగుతున్న సమయంలోనే.. దాద్రి ఘటనలోనూ పిల్లపిశాచి పాత్ర ఉందన్న సంగతి బయటకు రావటంతో.. మైనర్లు చేసే నేరాల విషయంలో ఎలాంటి శిక్షలు విధించాలన్న అంశంపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది.
Tags:    

Similar News