ఆ కుటుంబం టీడీపీతోనే...బాబుకు బిగ్ రిలీఫ్...?

Update: 2023-05-16 19:53 GMT
తెలుగుదేశం పార్టీ పెట్టాక అన్న ఎన్టీఆర్  కి తోడుగా నిలిచింది పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆయన తన ఆత్మకధలో ఇదే విషయం రాసుకున్నారు. తనకు రాజకీయాలు తెలియవు అని అయినా మామ గారి కోరిక మేరకు తాను రాజకీయాల్లో పాలుపంచుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఆ తరువాత టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు కాంగ్రెస్ నుంచి వచ్చి అందులో చేరారు.

అలా పెద్దల్లుడు, చిన్నల్లుడు ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చి ఎన్టీయార్  పార్టీని నడిపేవారు. అయితే టీడీపీలో రెండు వర్గాలు మాత్రం ఉండేవి. అలా ఇద్దరు తోడళ్ళుల మధ్యన విభేదాలు తారస్థాయిలో ఉండేవి. అయితే విచిత్రంగా ఎన్టీయార్ ని దించేయాలని అనుకున్నపుడు 1995 ఎపిసోడ్ లో మాత్రం చంద్రబాబు దగ్గుబాటి చేతులు కలిపారు. అలా బాబు సీఎం అయ్యారు. అయితే ఒప్పందం మేరకు దగ్గుబాటికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకపోవడంతో ఆయన బాబుని ఆయన పార్టీని వీడి ఎన్టీయార్  వైపు వచ్చారు.
 
ఎన్టీయార్  మరణాంతరం బీజేపీ ఆ మీదట కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన పర్చూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడారు. దాంతో రాజకీయాలకు దండం పెట్టేశారు. ఇక ఆయన సతీమణి, ఎన్టీయార్ కుమార్తె అయిన పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లో అడుగు పెట్టి రెండు సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. విభజన తరువాత ఆమె కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు

ఇక బీజేపీకి ఏపీలో పట్టు లేకపోవడంతో పాటు రాజకీయంగా ఆమెకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో ఆలోచనలో పడ్డారని అంటున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు  నుంచి దగ్గుబాటి ఫ్యామిలీకి సానుకూల సంకేతలతో పాటు పార్టీలో చేరాలన్న సూచనలు వచ్చాయని అంటున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీలో చేరితే పార్టీకి నైతిక బలం వస్తుందని, అన్న గారి కుటుంబం అంతా ఒకే పార్టీలో ఉంటే జనాలకు సానుకూల సంకేతాలు వెళ్తాయని కూడా భావిస్తున్నారుట.

ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు అయితే రాజకీయాలకు తాను దూరం అని చెప్పేసారు. పురంధేశ్వరి మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు ఆమె విశాఖ సీటుని కోరుకుంటున్నారు అని అంటున్నారు. ఆమె కనుక పార్టీ తీర్ధం పుచ్చుకుంటే లోక్ సభ టికెట్ ఇవ్వడానికి బాబుకు అభ్యంతరాలు లేవని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఎన్టీయార్ శత జయంతి వేడుకలకు హాజరు కావాల్సినదిగా దగ్గుబాటి దంపతులను ప్రత్యేకంగా ఉత్సవ కమిటీ చైర్మన్, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ టీడీ జనార్ధన్ ఆహ్వానించారు.

ఈ ఆహ్వానాన్ని ఆనందంగా అందుకున్న దగ్గుబాటి దంపతులు హాజరయ్యే అవకాశాలు నూరు శాతం ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే చాలా కాలానికి ఒకే వేదిక మీద దగ్గుబాటి చంద్రబాబులను చూడవచ్చు. అంతే కాదు రానున్న రోజులలో టీడీపీలో దగ్గుబాటి ఫ్యామిలీ చేరికకు అన్న గారి జయంతి వేడుక వారధి అవుతుందని కూడా అంటున్నారు.

ఇక నందమూరి ఫ్యామిలీలో ఉన్న మొత్తం మెంబర్స్ అందరినీ వచ్చే ఎన్నికల నాటికి ఒకే త్రాటి మీద తీసుకురావడానికి బాబు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీయార్ తో పాటు హరిక్రిష్ణ మరో కుమారుడు అయిన కళ్యాణ్ రామ్ కి కూడా ఇన్విటేషన్స్ పంపారు. జూనియర్ రాకపోయినా కళ్యాణ్  రామ్   అటెండ్ అవుతారు అంటున్నారు. మరి కాల క్రమంలో జూనియర్ ని కూడా తమ వైపునకు తిప్పుకునే నేర్పు ఓర్పు బాబుకు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్ తోనే ముందుకు సాగుతున్నరని అంటున్నారు.

Similar News