బాబు కాకి గోల చేశావు..లేస్తే మ‌నిషిని కాద‌న్నావు!

Update: 2018-07-21 08:36 GMT
ఎంతో ఉత్కంఠ‌ను `సృష్టించిన‌` అవిశ్వాసం అంచ‌నా వేసిన‌ట్లుగానే వీగిపోయింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లోక్‌ సభలో హోరాహోరీగా సాగిన చర్చ అనంతరం నిర్వహించిన ఓటింగ్‌ లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 ఓట్లు రాగా - వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ శిబిరంలో స‌హ‌జంగానే సంతోషం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో అవిశ్వాసం ప‌రిణామాల‌పై అధికార బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. మాజీ కేంద్ర‌మంత్రి - పార్టీ అగ్ర‌నేత పురంధీశ్వ‌రి - బీజేపీ అధికార ప్రతినిధి సుదీశ్ రాంబోట్ల హైద‌రాబాద్‌ లో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ చంద్ర‌బాబు తీరుపై మండిప‌డ్డారు. ``కాకి హిమాలయాల మీద కూచొని అరిచినా కాకి గోలనే అవుతుంది.. టీడీపీ కూడా అంతే. టీడీపీ అంటే దొంగ డ్రామాల - దౌర్జన్యకారుల పార్టీగా మారింది`` అంటూ విరుచుకుప‌డ్డారు.

చంద్ర‌బాబు పెట్టిన అవిశ్వాస తీర్మానం చిన్నప్పటి కథలాగా ఉందని పురందీశ్వ‌రి ఎద్దేవా చేశారు. `లేస్తే మనిషిని కాను అనే సామెత లాగా అవిశ్వాసం ఉంది.. మోడీ ప్రభుత్వాన్ని కులదోస్తాం అని డాంబికాలు నిన్నటితో తేలిపోయాయి. ఆంధ్రాకు నిజమైన దోషులెవరో తేలిపోయింది.`అని పురంధీశ్వ‌రి పేర్కొన్నారు. `బీజేపీ చిన్న రాష్టలను నమ్మింది. అందుకే కాకినాడ తీర్మానం చేశాం. చంద్రబాబు ఎవరికి ధన్యవాదాలు తెలపడానికి ఢిల్లీ వెళ్తున్నారు? ఈ విష‌య‌మై రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ కు ధన్యవాదాలు తెలపడానికి ..చంద్రబాబు వెళ్లడం హాస్యాస్పదం. ఎన్టీఆర్ ఎవరికి వ్యతిరేకంగా పార్టీ స్థాపించారో.. వారి మద్దతుతో అవిశ్వాసం పెట్టడం.. పార్లమెంట్లో ఆత్మగౌరవం తాకట్టు పెట్ట‌డ‌మే`` అని పురందీశ్వ‌రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసత్య పునాదుల మీద పరిపాలన సాగిస్తోందని పురందీశ్వ‌రి పేర్కొన్నారు. ``ఆనాడు..రాష్ట్ర విభజనకు మీరు ఉత్తరం ఇవ్వలేదా? కనీసం రాష్ట్ర భ‌విష్య‌త్ గురించి ఆలోచించారా చంద్రబాబునాయుడు గారు?  సమన్యాయం అంటే ఏమిటో.. చంద్రబాబు అడిగారా?మోడీని కించపరిచేలా మాట్లాడటం టీడీపీ ఎంపీలకు తగునా? ` అని ఆమె ప్ర‌శ్నించారు. దుగ్గరాజ పట్నం పోర్ట్ ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వం కారణమ‌ని స్ప‌ష్టం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కు జాప్యం టీడీపీ వల్ల కాదా అని నిల‌దీశారు. రైల్వే జోన్ ఖచ్చితంగా ఇస్తామ‌ని - ఆంధ్రప్రదేశ్ ఏది అడిగిన ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ``అభివృద్ది విషయంలో మేము రాజకీయం చెయ్యం.. చెయ్యబోము`` అని తెలిపారు. 2019లో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకు వస్తారని ఆమె ధీమా వ్య‌క్తం చేశారు.

టీడీపీ - కాంగ్రెస్ పొత్తు పార్లమెంట్ సాక్షిగా బయట పడిందని సుదీశ్ రాంబొట్ల స్ప‌ష్టం చేశారు. ``తెలుగువారి ఆత్మగౌరవాన్ని టీడీపీ మంట కలిపింది. థాంక్యూ మోడీజి అని గతంలో చంద్రబాబు ప్యాకేజ్‌ కు ఒప్పుకున్నారు. హోదా వల్ల ఏం లాభం అని, ప్యాకేజ్ కన్నా మించింది ఏమిటి అని - హోదా ఆలోచన వద్దు అని.. ఇలా వందల సార్లు చెప్పారు. 14వ ఆర్ధిక సంఘం సిఫారసుల వల్ల హోదా కన్నా ప్యాకేజ్ మేలు అని అన్నాము. అయితే ఇప్పుడు బాబు ప్లేట్ మార్చేశారు. చంద్రబాబు ఎస్పీవీని వద్దంటున్నారు. దీని పరమార్థం ఏమిటో అందరికి తెలుసు.ఎస్పీవీ ద్వారా నిధుల మల్లింపు ఉండదు కాబట్టి... వద్దంటున్నారు..`` అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగింది కాబట్టి..మళ్లీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి.. త‌న తప్పులు బీజేపీ మీద నెట్టి కాంగ్రెస్‌ తో కలిసి గెలుస్తాం అనే భ్రమలో చంద్రబాబు ఉన్నారని సుదీశ్ రాంబొట్ల ఆరోపించారు. ``దుగ్గరాజపట్నం పోర్ట్ విషయంలో - కడప స్టీల్ ప్లాంట్ కు కేంద్రం అడిగిన ప్రశ్నలకు రాష్ట్రం ఎందుకు జవాబు ఇవ్వడం లేదు.? భోగాపురంలో త‌మ‌కు నచ్చిన ప్రైవేట్ వాళ్లకు బిడ్ రాకపోవడంతో కాన్సెల్ చేశారు`` అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు ``టీడీపీకి కావాల్సింది రాజకీయం. కేంద్రం నిధులకు - రాష్ట్రం అప్పులకు లెక్కలు ఎందుకు చెప్పడం లేదు? మీరు దోచుకుంటే ..కేంద్రం చూస్తూ ఉండాలా?`` అని సూట‌గా ప్ర‌శ్నించారు.

Tags:    

Similar News