ద‌ళిత‌బంధు షురూ.. సీఎం కేసీఆర్ నిర్ణ‌యం

Update: 2021-12-18 16:32 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప‌థ‌కం ద‌ళిత బంధు. ల‌బ్ధిదారులైన ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు అందించే కీల‌క‌మైన ప‌థ‌కం. ఇది మ‌ళ్లీ అమ‌లు కానుంది. త్వ‌ర‌లోనే ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్రారంభించాల‌ని.. నిధులు కూడా జ‌మ చేస్తామ‌ని.. క‌లెక్ట‌ర్ల‌కు.. సీఎం కేసీఆర్ తాజాగా ఆదేశించారు. తొలుత‌ దీనిని ఇటీవ‌ల జ‌రిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక స‌మ‌యంలో ప్ర‌క‌టించారు. ద‌ళితుల ఓట్ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు సీఎం ఇలా చేశార‌నే వాద‌న వినిపించింది.

ఇక ప్ర‌తిప‌క్షాలు కూడా తీవ్ర విమ‌ర్శ‌లు చేశాయి. అయితే.. ఈ ప‌థ‌కం అప్ప‌ట్లో త‌ను ద‌త్త‌త తీసుకున్న వాసాల‌మ‌ర్రి గ్రామం స‌హా.. హుజూరాబాద్ వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. ఉప ఎన్నిక‌కు ముందు.. ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసి.. నిధులు కూడా విడుద‌ల చేశారు. అయితే.. ప్ర‌తిప‌క్ష బీజేపీ, కాంగ్రెస్ స‌హా ప‌లువురు నాయ‌కుడు.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో అప్ప‌ట్లో ఈ ప‌థ‌కం ఆగిపోయింది. అంతేకాదు.. విప‌క్షాల నుంచి కొత్త డిమాండ్లు కూడా వినిపించాయి. దీనిని రాష్ట్రం మొత్తం అమ‌లు చేయాల‌ని వారు కోరారు.

అయితే.. తాజాగా దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్‌.. దళిత బంధుపై కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలోనే దళిత బంధు నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే లక్ష్యమని కేసీఆర్‌ అన్నారు.

దళిత బంధును ఇప్పటికే అమలు చేస్తున్నామని, హుజురాబాద్‌తో పాటు నాలుగు మండలాల పరిధిలో ప్రకటించిన విధంగానే దళితబంధు అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప‌థ‌కం అమ‌లుపై ఎలాంటి స్ప‌ష్ట‌తా ఇవ్వ‌లేదు. మ‌రి దీనిపై విప‌క్షాలు ఎలాంటి కౌంట‌ర్లు ఇస్తాయో చూడాలి.
Tags:    

Similar News