ద‌ళిత బంధుః కేసీఆర్ ఎత్తు చిత్తేనా?

Update: 2021-08-01 01:30 GMT
ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో ‘ద‌ళిత బంధు..’ ప‌థ‌కం ఎంత‌ హాట్ టాపిక్ గా మారిందో అంద‌రికీ తెలిసిందే. కేవ‌లం హుజూరాబాద్ ఎన్నిక ముందు ఈ ప‌థ‌కాన్ని తేవ‌డం.. ఈ ప‌థకాన్ని ఎన్నిక‌ల కోస‌మే తెచ్చామ‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రే వ్యాఖ్యానించ‌డం.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చింది. అంతేకాదు.. పైల‌ట్ ప్రాజెక్టు అని పేరుపెట్టి ద‌ళిత బంధును కేవ‌లం హుజూరాబాద్ కే ప‌రిమితం చేయ‌డం ఇందులోని కొర్రీ కాగా.. ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనూ కేవ‌లం 100 ద‌ళిత కుటుంబాల‌కే ప్ర‌యోజ‌నం క‌ల్పించేందుకు సిద్ధ‌మ‌వ‌డం అస‌లైన విష‌యం.

దీంతో.. విప‌క్షాల‌తోపాటు షెడ్యూల్ కులాల స‌మ‌గ్రాభివృద్ధి క‌మిటీ నేత‌లు కూడా మండిప‌డుతున్నారు. అంటే.. కేవ‌లం వంద‌ కుటుంబాల‌కు ఏదో చేస్తున్నామ‌ని చెప్పి, హుజూరాబాద్ ప‌బ్బం గ‌డుపుకుందామ‌ని చూస్తున్నారా? అని కేసీఆర్ ను నిల‌దీస్తున్నారు. ఈ మేర‌కు తాజాగా షెడ్యూల్ కులాల స‌మ‌గ్రాభివృద్ధి క‌మిటీ నేత‌లు స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా నేత‌లు కేసీఆర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ద‌ళిత బంధును కేవ‌లం వంద కుటుంబాల‌కు అప్లై చేయ‌డం ఏంట‌ని నిల‌దీశారు. నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 45 వేల మంది ద‌ళితులు ఉండ‌గా.. ఆ కుటుంబాల‌న్నింటికీ ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింపజేయాల‌ని తేల్చి చెప్పారు. లేక‌పోతే.. కారు పంక్చ‌రైపోవ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

అంతేకాదు.. ఎప్ప‌టిలోగా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయాలో కూడా చెప్పేశారు. ఆగ‌స్టు 15వ తేదీలోగా నియోజ‌క‌వ‌ర్గం మొత్తం ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయాల‌ని డిమాండ్ చేశారు. ఆ త‌ర్వాత ఆగ‌స్టు 31లోపు రాష్ట్రంలోని ద‌ళితులంద‌రికీ ఈ ప‌థ‌కాన్ని అందించాల‌ని అల్టిమేటం జారీచేశారు. చిత్త‌శుద్ధితో ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌కుండా.. కేవ‌లం ఎన్నిక‌ల్లో వాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తే మాత్రం.. ఖ‌చ్చితంగా టీఆర్ఎస్ అభ్య‌ర్థిని ఓడిస్తామ‌ని హెచ్చ‌రించారు.

కాగా.. ఇప్ప‌టికే ఈ ప‌థ‌కంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క‌మవుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌నాలు కూడా ద‌ళితుల‌ను మ‌భ్య పెట్టేందుకే ఈ ప‌థ‌కం తెచ్చార‌ని అంటున్నారు. ఇదిలాఉంటే.. ఈ ప‌థ‌కంపై ఫోర‌మ్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్త‌య్యేంత వ‌ర‌కూ నిలిపేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరింది. ఒక‌వేళ వెంట‌నే ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తే.. హుజూరాబాద్ లో మిన‌హా.. రాష్ట్రంలోని మిగ‌తా 118 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అమ‌లు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. ఈ మేర‌కు ఫోరమ్ కార్య‌ద‌ర్శి ప‌ద్మ‌నాభ రెడ్డి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు.

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోడ్ లేక‌పోయిన‌ప్ప‌టికీ.. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ జోక్యం చేసుకోవాల‌ని కోరారు. ఎన్నిక‌ల కోస‌మే ఈ ప‌థ‌కం తెస్తున్నామ‌ని కేసీఆర్ బ‌హిరంగంగా చేసిన వ్యాఖ్య‌ల‌ను సైతం ఈ లేఖ‌లో ఉద‌హ‌రించారు. స్వ‌యంగా ముఖ్య‌మంత్రే ఎన్నిక‌ల కోసం ప‌థ‌కాన్ని తెస్తున్నామ‌ని వ్యాఖ్యానించ‌డం.. రాజ్యాంగాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. ద‌ళిత బంధు ప‌థ‌కం మంచిదే అని, అయితే.. ఎన్నిక‌ల కోస‌మే తీసుకురావ‌డం.. ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్ట‌డం కింద‌కే వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. ‘‘నేను హిమాలయాల్లో ఉండే సాధువును కాదు.. ఒక రాజ‌కీయ‌వేత్త‌ను.. ద‌ళిత బంధు ప‌థ‌కం ఉప ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొంద‌డానికే ప్ర‌వేశ‌పెట్టాం.. ఇందులో త‌ప్పేముంది?’’ అంటూ చేసిన వ్యాఖ్య‌లు ఏ మాత్రం స‌మ‌ర్థ‌నీయం కాద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. ఈ విధంగా ద‌ళిత బంధును ప్ర‌శ్నిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ప‌థ‌కంతో ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌ని భావించిన కేసీఆర్ కు ఇది మింగుడు ప‌డ‌ని ప‌రిణామ‌మే అని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి, ఏం జ‌రుగుతుంది? దళిత బంధు గులాబా పార్టీకి ఎంత వరకు ఉపయోగపడుతుంది అన్నది చూడాలి.




Tags:    

Similar News