ఒంగోలు టీడీపీలో ముసలం.. సీటు కోసం దామచర్ల సోదరుల ఫైట్!

Update: 2022-05-25 10:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ అప్పుడే ఎన్నికల వేడి నెలకొంది. అన్ని ప్రధాన పార్టీలు.. వివిధ కార్యక్రమాల రూపంలో ప్రజలను చుట్టేస్తున్నాయి. వైఎస్సార్సీపీ.. గడప గడపకు మన ప్రభుత్వం పేరిట జనాల్లోకి వెళ్తోంది. ఇక జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జిల్లాలను చుట్టేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బాదుడే బాదుడు కార్యక్రమంతో ప్రజల ముంగిట ఉంటున్నారు. వాస్తవానికి 2024లో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది వేసవిలో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఆయా పార్టీల్లో అసెంబ్లీ సీట్ల కోసం పంచాయతీ మొదలైపోయింది.

తాజాగా ఒంగోలు నగరంలో అసెంబ్లీ టికెట్ కోసం టీడీపీ నేతలు అప్పుడే ఒకరితో ఒకరు గొడవలకు దిగుతున్నారు. ఒంగోలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఆయన సోదరుడు దామచర్ల సత్యకు మధ్య సీటు దక్కించుకునే విషయంలో గొడవ నడుస్తోందని చెప్పుకుంటున్నారు.

అందులోనూ ప్రస్తుతం ఒంగోలులో మే 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడును నిర్వహించనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక మూడేళ్ల తర్వాత మహానాడును నిర్వహిస్తోంది. దాదాపు రెండు లక్షల మంది ఈ సభకు హాజరవుతారని టీడీపీ భావిస్తోంది. ఇంతలో పులి మీద పుట్రలా ఒంగోలు అసెంబ్లీ సీటు కోసం టీడీపీ నేతలు రోడ్డు ఎక్కడం ఆ పార్టీని కలవరపరుస్తోంది.

గతంలో ఒంగోలు ఎమ్మెల్యేగా పనిచేశారు.. దామచర్ల జనార్దన్. కమ్మ సామాజికవర్గానికి చెందిన జనార్దన్ జిల్లా టీడీపీలో ముఖ్య నేతగా ఉన్నారు. 2014లో ఒంగోలులో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన జనార్దన్ 2019లో వైఎస్సార్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లోనూ తనకే సీటు ఖాయమనే ధీమాలో ఉన్నారు. అయితే దామచర్ల జనార్దన్ బాబాయ్ కుమారుడు సత్య కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఒకే కుటుంబంలా కలసి ఉన్నారు.. జనార్దన్, సత్య. అయితే ఇప్పుడు తన తమ్ముడు తన సీటుకు ఎక్కడ అడ్డు వస్తాడో అని జనార్దన్ అతడిని దూరం పెట్టడం ప్రారంభించారు.

దీంతో ఒళ్లు మండిన దామచర్ల సత్య మహానాడు కోసం ఏర్పాటు చేసిన హోర్డింగులు, బ్యానర్లలో ఎక్కడా దామచర్ల జనార్దన్ ఫొటో లేకుండా చేశారు. కేవలం తన ఫొటో, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ ముఖ్య నేతల ఫొటోలు మాత్రమే హోర్డింగుల్లో, బ్యానర్లలో వేశారు. దీంతో దామచర్ల జనార్దన్, దామచర్ల సత్య మధ్య విబేదాలు తెరమీదకొచ్చాయి.

మహానాడు ముందు ఈ పరిణామం జరగడంతో టీడీపీ అధిష్టానం తలపట్టుకుందని సమాచారం. అటు దామచర్ల జనార్దన్, ఇటు దామచర్ల సత్యకు క్లాస్ పీకినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఇద్దరిని పిలిపించి మందలించినట్టు తెలుస్తోంది. విబేధాలు పక్కనపెట్టి కలిసి పనిచేయాలని వారికి సూచించారని సమాచారం.
Tags:    

Similar News