వైసీపీకి అక్కడ డేంజర్ బెల్స్... ?

Update: 2021-11-19 02:30 GMT
ఏపీలో అన్నీ గెలిచేశామని, తమకు తిరుగులేదని భావిస్తున్న వైసీపీకి ఇంతటి భారీ విజయంలోనూ మింగుడు పడని విషయాలు ఎన్నో ఉన్నాయనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కొన్ని జిల్లాలలో కాస్తా మెల్లగా పుంజుకుంటోంది. అది కూడా 2019 ఎన్నికల తరువాత తొలిసారిగా సానుకూలత సంపాదిస్తోంది.

సరే విపక్షం ఏదో కొన్ని సీట్లలో పుంజుకుంటే పోయేది ఏముంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. టీడీపీ బలపడడం వెనక వైసీపీ స్ట్రాటజీ ఫెయిల్యూర్ కూడా ఉంది. అంతే కాదు, వైసీపీ కలలు కంటున్న మూడు రాజధానుల అంశం విషయంలో ఎక్కడ కలసి వచ్చినా అమరావతి పరిధిలోని ప్రాంతాల్లో మాత్రం కుదిరే వ్యవహారం కాదని ఈ స్థానిక ఫలితాలు తేల్చి చెబుతున్నట్లుగా ఉంది.

అమరావతి రాజధానికి కేంద్రమైన గుంటూరు జిల్లాతో పాటు, అనుకుని ఉన్న క్రిష్ణా జిల్లా, ప్రకాశం వంటి చోట్ల సైకిల్ మెల్లగా కదులుతోంది. దానికి నిదర్శనం మునిసిపల్ ఫలితాలతో పాటు, పరిషత్ ఫలితాలు కూడా అంటున్నారు. వైసీపీకి కుప్పం అందించిన అమితానందాన్ని మింగేసేలా ప్రకాశం జిల్లా దర్శి రిజల్ట్ గట్టిగానే షాక్ ఇచ్చింది.

దర్శిలో టీడీపీ గెలుపు వైసీపీకి దిమ్మదిరిగేలా ఉంది. ఇక క్రిష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మునిసిపాలిటీ, కొండపల్లి సీటు కూడా ఢీ అంటే ఢీ కొడుతూ అధికార పార్టీని ఇబ్బందులో నేట్టేసింది. అలాగే గుంటూరు జిల్లా దాచేపల్లిలో కూడా వైసీపీ దూకుడుని టీడీపీ అడ్డుకుంది.

మరో వైపు చూస్తే పరిషత్ ఫలితాలలో కూడా గుంటూర్ జిల్లా తాడికొండ నియోజకవర్గం పరిధిలోని గూండాలపాడు, వేమవరం రెండు ఎంపీటీసీలు కూడా టీడీపీ వశం కావడం అంటే అధికార పక్షానికి అసలు డైజెస్ట్ కాని అంశమే. ప్రస్తుతం అమరావతి రైతుల మహా పాదయాత్ర కూడా ఏపీలో టాపిక్ గా ఉంది. వారు అన్ని జిల్లాలు దాటుకుంటూ ముందుకు సాగుతున్నారు.

దాంతో మిగిలిన జిల్లాలకు కూడా ఆ ప్రభావం రానున్న రోజుల్లో తాకేలా ఉందని అంటున్నారు. మొత్తానికి అమరావతి రాజధాని అంశంలో కొన్ని జిల్లాలు అధికార వైసీపీ మీద వ్యతిరేకతను చూపిస్తున్నారు అన్నది అర్ధమైంది.

అమరావతి రాజధాని ఎఫెక్ట్ పశ్చిమ గోదావరి జిల్లా మీద కూడా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి ఇలా సూచనాత్మకంగా కనిపించిన ఈ వ్యతిరేకత సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తిగా పెరిగి పెద్దది అయితే కచ్చితంగా ఈ జిల్లాల్లో వైసీపీకి భారీ షాక్ తగలడం ఖాయమే అంటున్నారు.

అయితే గ్రేటర్ రాయల‌సీమతో పాటు, ఉత్తరాంధ్రా జిల్లాలు కాపాడుతాయని వైసీపీకి అంచనాలు ఉండొచ్చు కానీ ఒకచోట ఒక అంశం మీద వ్యతిరేకత ఉంటే మరో చోట ఇంకో దాని మీద జనాలు రివర్స్ అవడం చూస్తున్నదే. దాంతో అనేక ఇతర అంశాలు ఆయా జిల్లాలలో ప్రభావం చూపిస్తే 2024 నాటికి మాత్రం వైసీపీ ఒడ్డెక్కడం కష్టమే అంటున్నారు. చూడాలి మరి దీనికి విరుగుడు మంత్రం వైసీపీ ఏం పఠిస్తుందో.


Tags:    

Similar News