అమెరికాలో రోజుకు లక్ష కేసుల రోజు దగ్గర్లోనే ఉందట

Update: 2020-07-21 09:30 GMT
ప్రపంచానికి పెద్దన్నగా బడాయి మాటల్ని చెప్పుకునే అమెరికా.. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో తీవ్రంగా నష్టపోతోంది. ప్రపంచంలో మరే దేశం ప్రభావితం కానంత దారుణంగా ప్రభావితమవుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో పాటు.. మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు రోజుకు 20వేల కేసులు నమోదు అయితేనే హడలిపోయే అగ్రరాజ్యం.. తాజాగా రోజుకు 70వేల కేసుల నమోదు వరకూ వెళ్లింది. రానున్న కొద్ది రోజుల్లోనే రోజుకు లక్ష వరకు పాజిటివ్ కేసులు నమోదు కావటం ఖాయమన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ అందుబాటులోకి రావటానికి మరికొంత కాలం సమయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అప్పటికి కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రానున్నది శీతాకాలం కావటం.. వాతావరణ పరిస్థితులు కూడా కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని నిపుణులు చెబుతున్న వేళ.. రానున్న రోజుల్లో అగ్రరాజ్యం పరిస్థితి ఎలా ఉంటుందో తలచుకోవటానికే భయంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కీలక అధికారి డాక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా తన తీరును మార్చుకోకపోతే గడ్డు పరిస్థితి ఎదుర్కోవటం ఖాయమని చెబుతున్నారు. ప్రభుత్వం.. ప్రజలు తమను తాము మార్చుకోవాలని ఆయన కోరుతున్నారు. అగ్రరాజ్యం.. అంతకు మించి సాంకేతికంగా ముందున్న దేశంలోని ప్రజలు ఇలాంటి విపత్తుల్ని అధిగమించేలా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ.. కేసులు నమోదవుతున్న తీరును చూస్తే.. అమెరికన్లు తప్పుల మీద తప్పులు ఎందుకు చేస్తున్నారు? అన్న సందేహం కలుగక మానదు.

అమెరికాలో భారీగా పాజిటివ్ కేసులు నమోదు వెనుక అసలు కారణాలు ఏమిటి? ఎక్కడ తప్పులు జరుగుతున్నాయన్న విషయాన్ని చూస్తే.. విస్మయకర అంశాలు బయటకు వస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలా? ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేయాలన్న ప్రశ్నలు ఎదురైప్పుడు ట్రంప్ సర్కారు మొదటి దానికే ఓటు వేసింది. ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆర్థిక సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకువీలుగా మార్కెట్లను హడావుడిగా ప్రారంభించారు. దీంతో.. వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగింది.

వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు వీలున్న మాస్కుల విషయంలో అమెరికన్ల ఆలోచనలు కరోనా కేసులు ఇంతలా పెరగటానికి కారణంగా చెప్పాలి. అమెరికన్లలో అత్యధికులు మాస్కులు ధరించటం అంటే.. తమ స్వేచ్ఛను తాకట్టు పెట్టినట్లుగా ఫీల్ కావటమే. దీనికి తోడు డెమొక్రాట్ పార్టీకి చెందిన నేతలు పలువురు మీరు ట్రంప్ కు వ్యతిరేకమైతే మాస్కులు వేసుకోకండి అన్న మాటలు కూడా ఒక కారణం. కేసులు పెరిగితే హెర్డ్ ఇమ్యూనిటీ పెరుగుతుందని అమెరికన్లు నమ్మారు. ప్రపంచంలో అతి పెద్దదైన డిస్నీ పార్కు.. బీచ్ లు.. క్లబ్బుల్లో జన ప్రవాహమే కనిపించింది. జాతి వివక్ష వ్యతిరేక ప్రదర్శనల్లోనూ ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్ల మీదకు రావటం కూడా అమెరికా కొంప మునగటానికి కారణమైందని చెప్పాలి. 
Tags:    

Similar News