క‌రోనాపై యుద్ధంః అమెరికా అలా.. భార‌త్ ఇలా.. ఎంత తేడా?

Update: 2021-05-15 13:30 GMT
ఇప్పుడు రెండు దేశాల‌ ప‌రిస్థితుల గురించి ప్ర‌పంచం మాట్లాడుకుంటోంది. రెండు ప‌రిణామాల‌పై విశ్లేష‌ణ‌లు చేస్తోంది. అందులో ఒక‌టి భార‌త్ లో కొన‌సాగుతున్న సెకండ్ వేవ్ క‌ల్లోలం గురించి. ప్ర‌పంచంలో ఏ దేశంలో కూడా న‌మోదుకానంత వేగంగా ఇండియాలో కొవిడ్ విస్త‌రిస్తోంది. నిత్యం 4 ల‌క్ష‌ల కేసులు న‌మోద‌వుతున్నాయి.

ఇంత‌టి దారుణ ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు భ‌యం గుప్ప‌టి కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఆసుప‌త్రుల్లో బెడ్లు దొర‌క్క‌.. ఆక్సీజ‌న్ అంద‌క‌.. మందులు స‌రిగా ల‌భించ‌క ఎంతోమంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మార‌ణ‌మోమం ఎన్నాళ్లు సాగుతుందో..? ఎప్పుడు చ‌ల్లారుతుందో తెలియ‌క అల్లాడిపోతున్నారు భార‌తీయులు. ఇది చాల‌ద‌న్న‌ట్టు థ‌ర్డ్ వేవ్ కూడా ముంచుకొచ్చే ప్ర‌మాదం ఉంది. సిద్ధంగా ఉండండి అని నిపుణులు హెచ్చ‌రిస్తున్న ప‌రిస్థితి!

ఇండియాలో ప‌రిస్థితి ఇలా ఉంటే.. అమెరికాలో స‌రికొత్త ప‌రిణామం అక్క‌డి ప్ర‌జ‌ల‌కు స్వేచ్ఛా వాయువులు అందించ‌బోతోంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న‌ అమెరిక‌న్లు మాస్కులు విసిరికొట్టొచ్చ‌ని ఆ దేశం చెబుతోంది. ఈ మేర‌కు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా త్వరలోనే మాస్కుల రహిత దేశంగా ఆవిర్భవిస్తుందని అన్నారు. అతి త్వరలో  అధికారిక ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మాస్కు ధరించకుండా హాజరయ్యారు. అమెరికా చరిత్రలో ఇదో సుదినంగా బిడెన్ అభివర్ణించారు. కంటికి కనిపించని వైరస్ మీద‌ అమెరికన్లు సుదీర్ఘకాలం పాటు కొనసాగిస్తూ వ‌చ్చార‌ని, ఆ యుద్ధం అంతిమ దశకు చేరుకుందని చెప్పారు.

ఇప్పుడు ఈ రెండు దేశాల‌ ప‌రిణామాలపై చాలా ఆస‌క్తిక‌రమైన చ‌ర్చ జ‌రుగుతోంది. అమెరికాలో ఇఫ్పటిదాకా 3,36,26,036 మంది కొవిడ్ బారిన ప‌డ్డారు. వీరిలో 5,98,540 మంది మరణించారు. ప్ర‌పంచంలో అత్య‌ధిక మ‌ర‌ణాలు సంభ‌వించింది ఇక్క‌డే. అయిన‌ప్ప‌టికీ.. అమెరికా రెట్టింపు వేగంతో దూసుకొచ్చింది. కొవిడ్ పై ప్ర‌ణాళికతో కూడిన‌ యుద్ధం చేసింది. బైడెన్ వ‌చ్చిన త‌ర్వాత కేవ‌లం వంద రోజుల్లోనే 200 మిలియన్ల మందికి వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో ప‌ని మొద‌లు పెట్టింది ప్ర‌భుత్వం. ఇప్పటికే 170 మిలియన్ల మందికి పైగా వ్యాక్సిన్ వేశారు. ఇక, మిగిలింది కొద్దిమంది మాత్ర‌మే. అందుకే.. స్వేచ్ఛ‌గా తిర‌గండి అని ఆ దేశం ప్ర‌క‌టించింది.

కానీ.. భార‌త్ విష‌యానికి వ‌స్తే లెక్క లేన‌న్ని ఫిర్యాదులు కేంద్ర ప్ర‌భుత్వం ముందున్నాయి. మేం హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని, దాని ఫ‌లిత‌మే ఈ మ‌హా విప‌త్తు అని ఎంతో మంది నిపుణులు ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు. కొంద‌రు మీడియా ముఖంగా ప్ర‌భుత్వం తీరును ఎలుగెత్తి చాటారు. దేశంలోని న్యాయ‌స్థానాలు ప్ర‌భుత్వ తీరును దునుమాడాయి. సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతున్న వేళ‌.. ప్ర‌జారోగ్యం గురించి ప‌ట్టించుకోకుండా.. కేంద్ర కేబినెట్ మొత్తం బెంగాల్లో కూర్చుంద‌నే విమ‌ర్శ‌లు వెలువ‌డ్డాయి. ప‌రిస్థితులు దారుణంగా ఉన్న‌వేళ‌.. కుంభ‌మేళాకు అనుమ‌తి ఇచ్చి కేసులు పెర‌గ‌డానికి కార‌ణ‌మైంద‌నే విమ‌ర్శ‌లు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ రెండు ప‌నుల వ‌ల్ల‌నే దేశం ఈ ప‌రిస్థితికి వ‌చ్చింద‌ని అంటున్నారు.

ఇదిలాఉంటే.. క‌రోనాపై పోరులో దేశం దారుణంగా దెబ్బ‌తిన‌డానికి వ్యాక్సిన్ కొర‌త మ‌రో ప్ర‌ధాన కార‌ణం అని చెబుతున్నారు. ప్ర‌పంచ‌క‌న్నా ముందే వ్యాక్సిన్ త‌యారు చేసుకున్నామ‌ని, విదేశాల‌కు సైతం స‌ర‌ఫ‌రా చేశామ‌ని చప్ప‌ట్లు కొట్టించుకున్న‌ప్ప‌టికీ.. దేశ ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కూ వ్యాక్సిన్ అందించ‌లేని దుస్థితి. అమెరికా ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల‌తో వేగంగా వ్యాక్సిన్ అందిస్తే.. భార‌త్ లో వ్యాక్సిన్ అందుతుందా? లేదా? అని ఇప్ప‌టికీ కోట్లాది మంది ఎదురు చూస్తుండ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. ముందస్తు ప్ర‌ణాళిక లేక‌పోవ‌డం.. అంతులేని నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శించిన కార‌ణంగానే శ‌వాలు గంగాన‌దిలో తేలియాడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది దేశం. ప్ర‌భుత్వం స‌కాలంలో స్పందించి ఉంటే.. ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, కొవిడ్ మొద‌టి ద‌శ నుంచి.. క‌రోనాను గెలిచిన దేశాల నుంచి మోడీ ప్ర‌భుత్వం ఏం నేర్చుకున్న‌ట్టు?
Tags:    

Similar News