లాక్‌ డౌన్ స‌డ‌లింపు ఫ‌లితం: ప‌క్షం రోజుల‌కు ల‌క్ష పెరిగిన కేసులు

Update: 2020-06-03 14:30 GMT
భార‌త‌దేశం కూడా కొద్దిరోజుల్లో అమెరికా స‌ర‌స‌న నిల‌వ‌నుంది. మ‌హ‌మ్మారి వైర‌స్ తీవ్ర రూపం దాలుస్తుండ‌డంతో రోజురోజుకు రికార్డు స్థాయిలో వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం ఆ మ‌హ‌మ్మారి విలయతాండవం చేస్తోంది. ఒక్క‌రోజు వేల‌కు వేల‌ల్లో పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అవుతున్నాయి. త్వ‌ర‌లోనే రోజుకు ప‌ది వేలు కూడా చేరే అవ‌కాశం ఉంది. ఆ వైర‌స్ ప‌రిణామం ఉగ్ర‌రూపం దాలుస్తోంది. కేవలం 15 రోజుల్లోనే దేశంలో ల‌క్ష కేసులు పెరిగాయి. లాక్‌డౌన్ 4లో నిబంధ‌న‌లు స‌డ‌లింపులు ఇవ్వ‌డం, ఆంక్ష‌లు ఎత్తేయ‌డంతో వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతున్నాం. రోజురోజుకు రూపాంతరం చెందుతూ వైర‌స్‌ మరింత బలంగా తయారవుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల‌ సంఖ్య రెండు లక్షలు దాటింది. కేవలం 15 రోజుల వ్య‌వ‌ధిలోనే బాధితుల‌ సంఖ్య లక్ష నుంచి రెండు లక్షలకు పెరగ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కేసులు 2,07,615 ఉన్నాయి.

వాస్త‌వంగా మే 19వ తేదీన ఈ కేసులు ల‌క్ష‌కు చేరాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గ‌ణాంకాల‌ ప్రకారం అప్పుడు మొత్తం కేసులు 1,01,139 ఉండ‌గా, 3,163 మంది మృతి చెందారు. 15 రోజుల తరువాత ఇప్పుడు దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,07,615 ఉంది. ఈ గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే దేశంలో కరోనా కేసులు పక్షం రోజుల్లో రెట్టింప‌య్యాయని తెలుస్తోంది. తాజా వివ‌రాల ప్ర‌కారం ఇప్పటివరకు ఆ వైర‌స్‌తో 5,815 మంది మృతిచెందారు. సుమారు 50 శాతం మంది అంటే 1,00,303 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇంకా ముందు ఉంది.. ముస‌ళ్ల పండ‌గ అంటూ ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే దేశంలో ఐదు ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.

భారీస్థాయిలో కేసులు పెర‌గ‌డానికి కార‌ణం లాక్‌డౌన్ క్ర‌మంగా ఎత్తేయ‌డం.. ఆంక్ష‌లు స‌డ‌లించ‌డ‌మేన‌ని చెబుతున్నారు. మొత్తం ప‌రిశీలిస్తే లాక్‌డౌన్ మిన‌హాయింపులు మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి కేసుల పెరుగుద‌ల అనేది తీవ్ర‌స్థాయిలో ఉంది. ఇప్పుడు సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో కేసులు మ‌రిన్ని పెరుగుతున్నాయి. స్వీయ జాగ్రత్తే శ్రీరామ‌ర‌క్ష‌గా భావించి వైర‌స్ రాకుండా ప్ర‌జ‌లు జాగ్ర‌త్త ప‌డాలి.
Tags:    

Similar News