టీకా కంటే ముందే కరోనాకు ఔషధం! ఇండియాలోనే ట్రయల్స్​

Update: 2020-11-03 23:30 GMT
కరోనా మహమ్మారి యావత్​ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరోనా టీకా కోసం ప్రజలంతా వేయికళ్లతో  ఎదురుచూస్తున్నారు. సైంటిస్టులు కూడా ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ టీకా కంటే ముందే కరోనాకు ఔషధం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) నుంచి కరోనాకు ఔషధం వచ్చే అవకాశం ఉన్నది. ఎండబ్ల్యు పేరుతో వచ్చే ఈ ఔషధం రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుంది. త్వరలోనే మూడో దశ ట్రయల్స్​ కూడా జరిగే అవకాశం ఉన్నది. మూడోదశ ట్రయల్స్​కు అనుమతులు వచ్చాయి. ఈ సందర్భంగా సీఎస్ఐఆర్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ విశ్వకర్మ మాట్లాడుతూ.. 'కరోనాకు మేము ఒక ఔషధాన్ని తీసుకొచ్చాం. ఇందుకు సంబంధించిన రెండు దశల క్లినికల్ ట్రయల్స్​ కూడా ఎంతో విజయవంతంగా ముగిశాయి. త్వరలోనే మూడో దశ ట్రయల్స్​ జరుగనున్నాయి. మూడో దశ ట్రయల్స్​ ఎంతో కీలకం.

మొత్తం 300 మందిపై మూడో దశ ట్రయల్స్​ జరుపబోతున్నాం. ఇండియాలోని ఎయిమ్స్, అపోలో వంటి ఆస్పత్రుల్లో ట్రయల్స్​ నిర్వహిస్తాం.  మూడో దశ ట్రయల్స్​ సక్సెస్​ అయితే వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ ఔషధం విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఇమ్యూన్ థెరపీ రూపంలో ఈ మందు పనిచేస్తుంది. దీనిని వ్యాధి బారిన పడిన వ్యక్తి తోపాటు ఆరోగ్యవంతులకు కూడా ఈ మందు ఇవ్వవచ్చు. వారిలో రోగనిరోధకశక్తి పెరిగి వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. రెండో దశలో ఈ ఔషధం విజయవంతమైంది. మనిషి శరీరంలోని కరోనాను అంతం చేయగలిగింది’ అని విశ్వకర్మ చెప్పారు. ఏది ఏమైనా వ్యాక్సిన్​ కన్నా ముందుగానే ఈ ఔషధం అందుబాటులోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.
Tags:    

Similar News