దేశంలో మళ్లీ పెరిగిన కరోనా ... ఒక్కరోజులో ఎన్ని కేసులంటే ?

Update: 2020-11-04 06:50 GMT
దేశంలో కరోనా మహమ్మారి జోరు పెరిగిపోతుంది. కరోనా కేసుల ఉద్ధృతి  కొనసాగుతోంది. కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 46,254 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 83,13,877 కి చేరింది. గత 24 గంటల్లో 53,357 మంది కోలుకున్నారు. గ‌త 24 గంట‌ల సమయంలో 514 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,23,611 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 76,56,478  మంది కోలుకున్నారు. 5,41,405 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌ లలో చికిత్స అందుతోంది.

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 11,29,98,959 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 12,09,609 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌ లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా, ఫ్రాన్స్ తర్వాత ఇండియా, ఇటలీ, స్విట్జర్లాండ్ టాప్ 5లో ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌ లో ఉండగా బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ మరణాల్లో ఇండియా టాప్ ప్లేస్‌కి రాగా... అమెరికా, ఇరాన్, ఫ్రాన్స్, రష్యా తర్వాతి స్థానంలో ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,637 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,273 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,44,143 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,24,686 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,357 కి చేరింది. ప్రస్తుతం 18,100 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 15,335 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.
Tags:    

Similar News