కార్పొరేట్‌ ఆస్పత్రులకు క్యూ కడుతోన్న కరోనా భాదితులు... బెడ్స్ ఫుల్ !

Update: 2021-03-30 10:30 GMT
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఊహించని రీతిలో అందరిని వణికిస్తూ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు కరోనా బాధితులు క్యూ కడుతున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విదంగా ఉందొ. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో బెడ్లు నిండిపోయాయి. దీంతో రోగులు డిశ్చార్జి అయిన తర్వాత, ఆ బెడ్ ను ఇతరులకు కేటాయించడానికి వెయిటింగ్‌ లిస్టులను తయారుచేశారు. రోజుకు 10 నుంచి 20 మంది కొవిడ్‌ రోగులు డిశ్చార్జి అవుతుండగా, 20 నుంచి 30 మంది ఆస్పత్రిలో చేరేందుకు వస్తున్నారని ఆస్పత్రుల నిర్వాహకులు చెబుతున్నారు. గాంధీ, టిమ్స్‌, నిమ్స్‌ ఆస్పత్రుల్లో కరోనా అడ్మిషన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కింగ్‌ కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో నాన్‌ కొవిడ్‌ సేవలను తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైనప్పటికీ, కరోనా ఉధృతి నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసి కరోనా సేవలపై దృష్టి పెట్టింది.

గత ఏడాది కరోనా వ్యాప్తి పతాక స్థాయిలో ఉన్న సమయంలో కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో 100-300 పడకలను కరోనా రోగులకు కేటాయించారు. 2020 అక్టోబరు నుంచి వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పడకల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు.గత వారం, పది రోజులుగా ఆస్పత్రులకు వచ్చే బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో పలు కార్పొరేట్‌ ఆస్పత్రులు పడకలను మళ్లీ 200కు పెంచగా, ప్రైవేటు ఆస్పత్రులు వాటిని 50కి పెంచాయి. అవసరానికి తగ్గట్టు పెంచుతున్నాయి. ఎన్ని బెడ్లు సిద్ధం చేస్తున్నా కూడా ఇంకా బాధితులు వెయిటింగ్ లిస్ట్ లో ఉండటం గమనార్హం. కరోనా సెకండ్‌ వేవ్‌ కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యసేవలకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేక వార్డుల ఏర్పాటు మొదలుకొని ఆక్సిజన్‌ వసతి, యంత్ర పరికరాల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు వంటి పలు కీలక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ఇక గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతానికి 200 పడకలతో కరోనా వార్డును సిద్ధం చేశారు. ఇక కింగ్‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో 350 పడకలను కరోనా చికిత్సకు కేటాయించారు. ఇందులో 200 పడకలు ఐసీయూకు కేటాయించగా, మరో 150 పడకలు ఆక్సిజన్‌ అందించే వార్డులుగా సిద్ధం చేశారు. ఇక కరోనా నిర్ధారణ అవుతున్న వారిలో 50 ఏళ్లకు పైబడిన వారే ఎక్కువని వైద్యవర్గాలు చెబుతున్నాయి. 60 నుంచి 70 ఏళ్లు దాటినవారి ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంటోందని తెలిపాయి. కరోనా ప్రభావంతో ఎక్కువమందిలో శ్వాస సమస్యలే తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు చెప్పారు. దాదాపుగా హైదరాబాద్ నగరంలో ఏ కార్పొరేట్ హాస్పిటల్ లో కూడా ఏర్పాటు చేసిన బెడ్లు మొత్తం దాదాపుగా నిండిపోయాయి.

ఇదిలా ఉంటే .. దేశంలో గ‌త 24 గంటల్లో 56,211 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం నిన్న‌ 37,028  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 271 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,62,114 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,13,93,021 మంది కోలుకున్నారు.  దేశ వ్యాప్తంగా 6,11,13,354 మందికి వ్యాక్సిన్లు వేశారు.
Tags:    

Similar News