కరోనా కల్లోలం: పైసలకే దాసోహం

Update: 2021-04-16 08:30 GMT
నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అని ఒకప్పుడు పాడుకునేవారు.. కానీ ఇప్పుడు మేం పోం బిడ్డో ప్రైవేటు దవాఖానకు అని పాడుకోవాల్సిన దారుణ పరిస్థితులు దాపురించాయి. కరోనా కల్లోలాన్ని ప్రైవేటు ఆస్పత్రులు ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. వేలు, లక్షలు లేనిదే ప్రైవేటు ఆస్పత్రి గడప తొక్కలేని పరిస్థితులు హైదరాబాద్ లో దాపురించాయని బాధితులు వాపోతున్నారు.

కరోనా దారుణాలకు కారణమవుతోంది. వైరస్ చూపిస్తున్న అనార్థాలకు ఒళ్లు, ఇల్లు గుల్ల అవుతోంది. కరోనా సోకితే ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. బెడ్స్ ఎక్కడా ఖాళీ లేవు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో అయితే రికమండేషన్ లేనిదే బెడ్ దొరకని పరిస్థితి ఉందట.. బండ్ల గణేష్ లాంటి నిర్మాత, నటుడికే బెడ్స్ దొరకలేదని.. ఆయన చిరంజీవిని సాయం అడిగి అపోలోలో బెడ్ ఇప్పించుకున్నాడని వార్తలు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులంతా ఇప్పుడు హైదరాబాద్ కు కరోనాతో రావడంతో ఏ ఆస్పత్రిని చూసినా ‘బెడ్లు లేవు.. సారీ’ అనే సమాధానమే వస్తోంది. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో రోజుకు రూ.50వేల నుంచి రూ.60వేల దాకా ఆస్పత్రి బిల్లు వేస్తున్నారు. ప్రాణభయానికి రోగులు కట్టకతప్పని పరిస్థితి.

ఇక వెంటీలేటర్ అయితే రోజుకు రూ.1 లక్ష వరకూ వసూలు చేస్తున్నారు. రోజుకు రూ.4000 మాత్రమే వెంటిలేటర్ పై వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించినా అది ఎక్కడా అమలు కావడం లేదు.. పట్టించుకోవడం లేదు.

ఇప్పుడు కరోనా వచ్చి ప్రైవేటు ఆస్పత్రికి వెళితే జలగల్లా పేదల  డబ్బులను పీల్చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కరోనా చికిత్సలకు ప్రభుత్వం విధించిన ఫీజులనే తీసుకోవాలని.. దీనిపై ప్రభుత్వం నిఘా పెట్టాలన్న డిమాండ్ రోగుల నుంచి వినిపిస్తోంది.
Tags:    

Similar News