ముందు జగన్....వెనక పవన్ !
43 ఏట అడుగు పెడుతుంది. ఈ నేపథ్యంలో మే నెలలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.;
తెలుగుదేశం పార్టీ నిజంగా చరిత్ర సృష్టించిన పార్టీయే. ఈ నెల 29తో ఆ పార్టీ పుట్టి అచ్చంగా 42 ఏళ్ళు పూర్తి అవుతాయి. 43 ఏట అడుగు పెడుతుంది. ఈ నేపథ్యంలో మే నెలలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే వెరీ స్పెషల్. అసలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసిన పార్టీగా టీడీపీని చూడాలి. ఈసారి మహానాడు టీడీపీకి అత్యంత ప్రత్యేకంగా ఉంది. 2019 నుంచి 2024 మధ్యలో టీడీపీ అనేక రకాలైన ఇబ్బందులు పాలు అయింది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచి ఆ పార్టీ వైసీపీ నుంచి వచ్చిన ఒత్తిడికి టార్గెట్ కి మధ్య నలిగిపోయింది.
ఒక దశలో ఏకంగా పార్టీ పెద్ద చంద్రబాబు అరెస్టు కావడంతో టీడీపీ అతి పెద్ద సంక్షోభం వైపుగా కూడా పయనించింది. అయితే ఆ అరెస్ట్ నే బ్యాక్ బౌన్స్ గా చేసుకుని వీర విహారం చేసింది. 2024 ఎన్నికల్లో కొడితే కొట్టాలి సిక్స్ అంటూ ఏకంగా 164 సీట్లతో కూటమిని గెలిపించుకుంది. గత పది నెలలుగా ఏపీలో టీడీపీ కూటమి పాలన సాగుతోంది.
బాబు నాలుగవ సారి సీఎం గా ఉన్నారు. లోకేష్ కీలక శాఖలను చూస్తూ బాబుకు సరిజోడుగా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇంత జరుగుతున్నా టీడీపీ ప్రభుత్వం అని కాకుండా కూటమి ప్రభుత్వం అని చెప్పడమే పార్టీలోని హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి కొంత కష్టంగా ఉందిట. అంతే కాదు ఏ పదవి వచ్చినా కూటమిలోని పార్టీలు షేర్ చేసుకోవడంతో ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న వేలాది మంది టీడీపీ తమ్ముళ్లకు నిరాశ ఎదురవుతోంది.
వీటికి తోడు జనసేన ఆవిర్భావ సభలో ఇటీవల ఆ పార్టీ పెద్దలు చేసిన కామెంట్స్ మరో ఎత్తు అన్నట్లుగా ఉన్నాయని అంటున్నారు. ఇక చూస్తే కనుక టీడీపీని నిలబెట్టామని చెప్పడం కూడా వారిని తీవ్రంగా బాధిస్తోంది అని అంటున్నారు. ఒంటరిగా టీడీపీ గెలవలేదు అని వైసీపీ ఒక వైపు సూటి పోటీ మాటలు అంటూ ఉంటుంది. మేము గెలిచినా ఓడినా సోలో అని కూడా చెబుతుంది.
అంతకు మూడింతలు వయసు, పెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి ఈ తరహా కామెంట్స్ రావడమేంటి అన్న చర్చ అయితే తమ్ముళ్లలో తీవ్రంగా ఉంది. ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ గెలుస్తుంది అని దానిని నిజం చేసి రుజువు చేయాల్సింది అధినాయకత్వం అని అంటున్నారు. అయితే టీడీపీ అధినాయకత్వం ఇపుడు ఒక విధమైన రాజకీయ డైలామాలో ఉంది అంటున్నారు.
ముందు ప్రత్యర్థిగా జగన్ కంటికి కనిపిస్తున్నారు. వైసీపీ కి చాన్స్ ఇవ్వకూడదు అనుకుంటే కచ్చితంగా పొత్తులతో వెళ్ళాలి. మరి పొత్తులు అంటే జనసేనను కలుపుకుని పోవాలి. ఇక పొత్తు పార్టీలు చేసే వ్యాఖ్యలు బాధించినా ఇది తప్పదన్నట్లుగానే ఆ పార్టీ పెద్దలు ఉన్నారు.
అయితే మరో వైపు చూస్తే ఇంకో చర్చ కూడా సాగుతోంది. జగన్ ప్రత్యర్ధి. ఇది కచ్చితంగా ఎదురుగా కనిపించే విషయం. ఆ మాటకు వస్తే జనసేన కూడా ఏదో రోజుకు ప్రత్యర్థిగా మారదా అన్నదే ఆ చర్చ. ఈ రోజున పొత్తుతో కలసి బలం పెంచుకుని రేపటి రోజున ఎదురు నిలిస్తే అపుడు సంగతేంటి అన్నది కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా త్యాగాలు చేయదు కదా. అంతిమ లక్ష్యం అధికారమే కదా అన్నది కూడా పసుపు శిబిరం ప్రస్తావనలో ఉంది.
జగన్ కి అంగబలం అర్ధ బలం ఉంటే పవన్ కి సినీ గ్లామర్ బలమైన సామాజిక వర్గం వెన్ను దన్నుగా ఉన్నాయి. పైగా బీజేపీ దన్ను కూడా ఉంది. ఇవన్నీ కలిస్తే జనసేన కూడా ఏదో నాటికి ఏకు మేకుగా మారకపోతుందా అన్నది చర్చగా ఉంది. రాజకీయంగా అందరూ లైట్ తీసుకునే ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా తాజాగా కొన్ని కామెంట్స్ చేశారు. పవన్ ని పెంచి పోషిస్తున్నారని అది ఇబ్బంది అని టీడీపీనే హెచ్చరిస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.
ఇలా టీడీపీలో ఈ పొత్తుల పట్ల మిత్రుల పట్ల అంతర్మధనం ఉన్నా అది అనివార్యంగానే ఉంది అని పెద్దలు అంటున్నారు. వైసీపీని పొలిటికల్ గా ఎలిమినేట్ చేస్తే ఆ తరువాత కధ చూసుకోవచ్చు అన్నది బహుశా టీడీపీ పెద్దల వ్యూహం కావచ్చు. కానీ వైసీపీ ఎలిమినేట్ ఎలా అవుతుంది అన్నది మరో ప్రశ్న. అది జగన్ చుట్టూ అల్లుకున్న పార్టీ. ఒక్క జగన్ చాలు మళ్ళీ అది లేచి కూర్చోవడానికి.
పైగా జగన్ కి వయసు కూడా రాజకీయంగా బోలెడు ఉంది. ఈ విధంగా చూస్తే టీడీపీ వ్యూహాలలో ఎక్కడో తేడా కొడుతోందా అన్నది కూడా ఉంది. మొత్తానికి చూస్తే కూటమి నుంచి టీడీపీ వేరు పడలేదు. ఈ రాజకీయ బంధం నుంచి దూరం కాలేదు. మరి రేపటి రోజున బాబు కనుక సైడ్ అయితే లోకేష్ కి ఈ చిక్కు ముళ్ళను విప్పుకోవడం వీలు అవుతుందా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది అంటున్నారు.