జగన్ ఆందోళనే నిజమైందా ?

Update: 2021-04-22 04:30 GMT
కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆందోళనే నిజమైనట్లుంది. కరోనా వైరస్ కారణంగా స్ధానికసంస్దల ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం మొత్తుకుంది. అయినా సరే ఎన్నికలు జరగాల్సిందే అని స్టేట్ ఎలక్షన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టిగా పట్టుబట్టారు. పైగా రాష్ట్రంలో కోవిడ్ సమస్య తగ్గిపోయిందని, కాబట్టి ప్రభుత్వం చెప్పే కారణాలు సహేతుకంగా లేవంటు నిమ్మగడ్డ కోర్టుకెక్కారు. కోర్టు కూడా నిమ్మగడ్డ వాదననే బలరపరిచింది.

తన వాదనకు మద్దతుగా బీహార్, తెలంగాణాలో జరిగిన ఎన్నికలను నిమ్మగడ్డ ఉదాహరణగా చూపిస్తే కోర్టు కూడా అవునవునంది. అప్పట్లో చంద్రబాబునాయుడుతో పాటు మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఎన్నికలు వాయిదా వేయాలన్న జగన్ వాదనను తప్పుపట్టాయి. ఎన్నికల్లో పోటీచేయాలంటే అధికారపార్టీ భయపడుతోందంటు ఎగతాళిచేశాయి. వీళ్ళకి టీడీపీకి మద్దతుగా నిలిచే మీడియా కూడా జగన్ కు వ్యతిరేకంగా కథనాలను వండివార్చింది.

సీన్ కట్ చేస్తే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతికి ఎన్నికలు నిర్వహించటమే ప్రధాన కారణంగా ప్రత్యేక కథనం ఇచ్చింది. ఎనిమిది దశల్లో పోలింగ్ జరుగుతున్న పశ్చిమబెంగాల్లో కరోనా వైరస్ కేసులు మునుపటితో పోలిస్తే 1500 శాతం పెరిగిపోయిందట. తమిళనాడులో 62 శాతం, అస్సాలో 230 శాతం యాక్టివ్ కేసులు పెరిగిపోయిందట. తమిళనాడు, కేరళలో కూడా యాక్టివ్ కేసులు పెరగటానికి ప్రధానకారణం ఎన్నికలే అని సదరు మీడియా తేల్చేసింది.

ఇక నిమ్మగడ్డ, చంద్రబాబు+ప్రతిపక్షాలంతా ఉదాహరణగా చూపించిన బీహార్ లో కూడా ఎన్నికల తర్వాత కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయని ఇపుడు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికల ముందుతో పోలిస్తే తర్వాత కరోనా బాధితుల సంఖ్య లక్షల్లో పెరిగిపోయిందట. చివరకు నాగార్జునసాగర్ ఉపఎన్నిక వల్ల కూడా వేలల్లో కేసులు పెరిగిపోతున్నాయట. ఇన్నింటి లెక్కలు ఇచ్చిన సదరు మీడియా తిరుపతి ఉపఎన్నికల ఊసే ఎత్తలేదు. పైగా అంతకుముందు జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల గురించి కనీసం ఒక్క లైన్ కూడా రాయలేదు.

ఎక్కడో జరిగిన బీహార్, బెంగాల్ అస్సాం, తమిళనాడు, కేరళలో ఎన్నికలకు ముదు ఎన్నికేసులు, తర్వాత ఎన్ని కేసులు నమోదయ్యాయో చెప్పిన మీడియా ఏపిలో కేసుల గురించి మాత్రం ఎందుకు రాయలేదు. ఎందుకంటే స్ధానికసంస్ధల ఎన్నికల నిర్వహణలో జగన్ ఆందోళనే నిజమైందని అంగీకరించాల్సొందన్న ఏకైక కారణంతోనే ఏపి ఎన్నికల గురించి మాత్రం ఒక్క లైనుకూడా రాయలేదు. మిగిలిన రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోవటానికి ఎన్నికలే ప్రధాన కారణమని చెప్పిన మీడియా ఏపిలో మాత్రం జగన్ చేతకానితనం వల్లే కేసులు పెరుగుతున్నట్లు తేల్చేయటమే ఆశ్చర్యంగా ఉంది.
Tags:    

Similar News