మళ్లీ దేశంలో పెరిగిన పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే !

Update: 2021-06-24 05:30 GMT
ఇండియా లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ జోరు ఇంకా పూర్తిగా తగ్గలేదు. కానీ, గతంతో పోల్చితే కొంతమేర తగ్గింది అని చెప్పవచ్చు. గతంలో కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు అయ్యాయి. ఆ సంఖ్య ప్రస్తుతం 50 వేలకి తగ్గింది. అయితే , కిందటి రోజు కంటే నిన్న నమోదు అయిన కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య కొంచెం పెరిగింది. దేశంలో  గడిచిన 24 గంటల్లో కొత్తగా 54,069 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులతో కలిపి, ప్రస్తుతం  దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,82,778కి చేరింది. వీటిలో  6,27,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక, ఇదిలా ఉంటే, నిన్న కొత్తగా 68,885 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వడంతో.. రికవరీల సంఖ్య 2,90,63,740కి చేరింది. అలాగే , గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా  1,321 మంది మృతి చెందగా, దేశంలోని  మొత్తం కరోనా వైరస్ మృతుల సంఖ్య 3,91,981 చేరుకుంది. అలాగే ఇప్పటిదాకా 30.2 కోట్ల  వ్యాక్సినేషన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.61 శాతంగా ఉందని, కరోనా వైరస్ మరణాల రేటు 1.30 శాతంగా ఉందని తెలిపింది. కాగా, కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు అన్‌ లాక్ ప్రక్రియను మొదలుపెట్టాయి. ఎక్కువ పాజిటివిటీ రేట్ ఉన్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన లాక్‌ డౌన్‌ ను కొనసాగిస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో వెలుగు చూస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులు కలవరపెడుతున్నాయి. ఇప్పటిదాకా దేశంలో మొత్తం 40 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదు అయినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 
Tags:    

Similar News