సారు.. అనవసరమైన పంతాలకు పోతున్నారా?

Update: 2020-07-25 07:30 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లోని విలక్షణత అందరికి తెలిసిందే. ప్రజలు ఎన్నుకున్న ప్రజానాయుడ్ని అని.. ముఖ్యమంత్రిని అన్న భావన చాలా ఎక్కువగా చెబుతారు. మూడున్నర కోట్ల మందికి ముఖ్యమంత్రిని.. నువ్వు నాకు చెప్పేదేమిటన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. దీనికి తోడురాష్ట్రంలో తనకు ధీటుగా నిలిచే నేత లేకపోవం కేసీఆర్ లో కాన్ఫిడెన్సును మరింత పెంచిందని చెబుతారు. తానేం చెబితే అది జరిగిపోతున్న వేళలో.. ఆయన గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణ ఉంది.

తాను ఏదైనా తప్పు చేస్తే.. ఎదుటోడు వేలెత్తి చూపించటానికి ముందే.. తన తప్పును ఒప్పేసుకోవటం కేసీఆర్ కు అలవాటు. ఇదే పలుమార్లు ఆయన్ను చాలా సమస్యల నుంచి బయటకు పడేసిందని చెప్పాలి. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. ఆ వెంటనే వెనక్కి తగ్గటం లాంటివి చేస్తూ.. పట్టువిడుపులతో వ్యవహరించే సీఎంగా ఆయనకు పేరుంది. కొన్ని సందర్భాల్లో మొండితనంతో వ్యవహరించినా.. దాంతో తిప్పలు తప్పవన్న భావనకు వచ్చినంతనే వెనకడుగు వేయటం ఆయనకు అలవాటే.

అందుకు భిన్నమైన పద్దతి ఈ మధ్యన కేసీఆర్ లో కనిపిస్తోందని చెబుతున్నారు. కరోనాకు సంబంధించిన లెక్కల విషయంలో కానీ.. సచివాలయం కూల్చివేత ఎపిసోడ్ లోనూ.. ఉస్మానియా ఆసుపత్రి భవనం విషయంలో ఆయన మిగిలిన వారి మాటల్ని పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా తనకు తోచినట్లే చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన డ్రీం అయిన సచివాలయాన్ని కూల్చివేసే విషయంలో తాను అనుకున్నట్లే చేస్తున్న కేసీఆర్. కూల్చివేత వద్దకు మీడియాకు అనుమతి లేదని తేల్చేశారు.

ఇదే విషయం హైకోర్టు ముందుకు వెళ్లింది. వార్ జోన్ లోకి మరీ వార్తలురాసే విలేకరులకు.. సచివాలయం కూల్చివేత వద్దకు ఎందుకు అనుమతించరు? అన్న ప్రశ్నను సంధించింది. ఈ విషయాన్ని మరింత సాగదీయకుండా.. ఏ రోజుకు ఆ రోజు బులిటెన్ ఇస్తామని.. ఎంపిక చేసిన మీడియా సిబ్బందిని పరిమిత కాలానికి అనుమతిస్తామని చెబితే హైకోర్టు కూడా ఏమనేది కూడా కాదేమో. అందుకు భిన్నంగా మీడియాను అనుమతించేదే లేదన్నట్లుగా ముకుంపట్టు వేసుకొని కూర్చోవటం.. కోర్టు అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమలటం లాంటివి చేయటం హైకోర్టుకు సైతం ఇరిటేషన్ కలిగేలా చేస్తుందని చెబుతున్నారు. ప్రతి విషయానికి పంతానికి పోకుండా.. సమయానికి తగ్గట్లుగా వ్యవహరించే కేసీఆర్.. ఇప్పుడు ఎందుకంత భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు? ఇంతకూ ఈ మధ్యన కేసీఆర్ కు ఏమైంది?
Tags:    

Similar News