తెలంగాణ బులిటెన్ టైమింగ్ మార్చేశారట.. ఇక నుంచి ఉదయమేనట

Update: 2020-07-27 05:30 GMT
ఎంతకూ కొరుకుడుపడని రీతిలో ఉంటుంది తెలంగాణ రాష్ట్ర సర్కారు విడుదల చేసే హెల్త్ బులిటెన్. మొదట్లో ఒకటి.. ఒకటిన్నర పేజీల్లో పూర్తి అయ్యే కరోనా బులిటెన్ తాజాగా పద్దెనిమిది పేజీలకు పెరిగింది. దీనికి సంబంధించిన క్రెడిట్ మాత్రం తెలంగాణ హైకోర్టుకు చెందుతుంది. తర్వాత.. బులిటెన్ లో మార్పు కోసం ప్రయత్నించి.. కేసులు పెట్టిన వారికి చెప్పాల్సిన అవసరం ఉంది.

గతంతో పోలిస్తే.. తెలంగాణ బులిటెన్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారీగా సమాచారం ఇచ్చినా.. అందులో మారని సమాచారమే ఎక్కువ. ఉదాహరణకు యాంటీజెన్ టెస్టులు చేసే కేంద్రాలు.. జిల్లాల్లో వైద్యం అందించే ప్రైవేటు ఆసుపత్రులు ఇలాంటి వాటిని నిత్యం కాపీ.. కట్.. పేస్ట్ చేయటం మినహా మరెలాంటి మార్పు ఉండదన్నది మర్చిపోకూడదు.

బులిటెన్ తయారీ ఒక ఎత్తు అయితే.. దాన్ని విడుదల చేసే టైమింగ్ విషయం మరో ఎత్తు. ఎవరెన్ని చెప్పినా.. ఏ రోజుకు ఆ రోజు బులిటెన్ విడుదల చేసే రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా లేవు. ముందు రోజు వివరాల్ని రిలీజ్ చేస్తున్నారు. అదే విషయాన్ని ఉన్నతాధికారులు తమ ప్రైవేటు సంభాషణల్లో స్పష్టం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో ప్రతి రోజూ రాత్రి వేళలోనే బులిటెన్లు ఫోన్లు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే రాత్రి పదకొండు గంటల వేళలో రిలీజ్ చేయటానికి కారణం ఏమిటో అర్థం కాదు.

రోగులకు వైద్యసేవలు అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరు ఎలా ఉందన్న విషయాన్ని పక్కన పెడితే.. ప్రాథమికంగా సిద్ధం చేయాల్సిన రిపోర్టులు కోర్టు చెప్పినట్లు వివరాలు ఎందుకు వెల్లడించటం లేదన్న ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్ల మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతోంది. దీంతో.. వివరాలు పెద్దగా వెల్లడించకుండానే.. చాలా వివరాలు వెల్లడించినట్లు కనిపించేలా కసరత్తు పూర్తి చేశారు. బులిటెన్ విడుదల చేసే విషయంలోనూ టైమింగ్ ను మార్చటం ద్వారా చాలా మార్పులు చేశామన్న భావన కలిగేలా చేస్తున్నట్లు చెప్పాలి. ఇప్పటివరకూ సాగిన దానికి భిన్నంగా.. తెలంగాణ రాష్ట్ర బులిటెన్ ను ఇకపై ఉదయం పదకొండు గంటల సమయానికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరీ.. మార్పులపై హైకోర్టు ఏలా రియాక్టు అవుతుందో చూడాలి.
Tags:    

Similar News