వుహాన్ ల్యాబ్ లో డేంజ‌ర‌స్ ప‌రిశోధ‌న‌ల‌కు.. అమెరికా నిధులు..?

Update: 2021-07-25 07:50 GMT
క‌రోనా వైర‌స్ ఎక్క‌డి నుంచి వ‌చ్చిందంటే.. అంద‌రూ చైనాలోని వుహాన్ ల్యాబ్ నే సూచిస్తారు. ఇది నిజంగా త‌యారు చేసి వ‌దిలారా? ప్రమాద వశాత్తూ బయటకు వచ్చిందా? అస‌లు స‌హ‌జ సిద్ధంగానే ఉద్భ‌వించిందా? అనే ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రి స‌మాధానాలు, అనుమానాలు వారికున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇందులో ఏదీ నిరూప‌ణ కాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెళ్ల వ‌చ్చి కూడా ఏమీ తేల్చ‌లేక‌పోయింది. అయితే.. ఈ విష‌యం ఇలా ఉంచితే.. ఇప్పుడు మ‌రో అంశం హాట్ టాపిక్ గా మారింది. అదేమంటే.. చైనాలోని వుహాన్ ల్యాబ్ లో నిర్వ‌హించే ప్ర‌మాద‌క‌ర ప‌రిశోధ‌న‌ల కోసం అమెరికా నిధులు ఇచ్చింద‌న్న‌ది దాని సారాంశం. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ విష‌య‌మై డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. మ‌రి, ఇంత‌కీ ఏం జ‌రిగింది? అన్న‌ది చూద్దాం.

చైనాలోని వుహాన్ ల్యాబ్ లో ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ రీసెర్చ్ కోసం అమెరికా నుంచి నిధులు వెళ్లాయని అమెరికన్ రిపబ్లికన్ పార్టీ సెనేటర్ రేండ్ పాల్ ఆరోప‌ణ‌లు చేశారు. ఈయ‌న ఆరోప‌ణ‌లు ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. గెయిన్ ఆఫ్ ఫంక్ష‌న్ అంటే.. ఒక జీవి కొత్త శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను సంత‌రించుకోవ‌డాన్నే గెయిన్ ఆఫ్ ఫంక్ష‌న్ అంటారు. ఇది రెండు విధాలుగా జ‌ర‌గొచ్చు. ఒక‌టి ప్ర‌కృతి స‌హ‌జంగా జ‌రగొచ్చు.. లేదంటే, ప్ర‌యోగ‌శాల‌లో కూడా మందులను ఉప‌యోగించి కూడా ఈ సామ‌ర్థ్యాల‌ను ఆ జీవికి ర‌ప్పించొచ్చు.

క‌రువు కాట‌కాల‌ను త‌ట్టుకునే విత్త‌నాల‌ను సృష్టించ‌డం, దోమ‌ల్లో వ్యాధి క‌లిగించే ల‌క్ష‌ణాల‌ను తగ్గించ‌డం వంటి ప‌నుల‌ను ఈ విధానం ద్వారానే చేస్తారు. వుహాన్ ల్యాబ్ లో ఈ త‌ర‌హా ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయ‌ని, ఇందుకు అమెరికా నిధులు విడుద‌ల చేసింద‌న్న‌ది ఆరోప‌ణ‌. జీవుల్లో జెనెటిక్ కోడ్ మార్చ‌డం ద్వారా కానీ.. లేదంటే, పూర్తి భిన్న‌మైన వాతావ‌వ‌ర‌ణంలో ఆ జీవుల‌ను ఉంచ‌డం ద్వారా కానీ.. శాస్త్ర‌వేత్త‌లు ఈ మార్పును తీసుకొస్తారు. వాస్త‌వానికి ఇలాంటి రీసెర్చ్ లో న‌ష్టం ఎక్కువే ఉంటుంది. అయితే.. భ‌విష్య‌త్ లో రాబోయే వైర‌స్ ల‌ను ఎదుర్కోవ‌డానికి, వ్యాక్సిన్లు క‌నిపెట్ట‌డానికి ఇదే మార్గ‌మ‌ని చెబుతుంటారు సైంటిస్టులు. దీనిపై అమెరికా అధ్య‌క్షుడు స‌ల‌హాదారు ఫౌచీ స్పందిస్తూ.. ఇలాంటి ప‌రిశోధ‌న‌ల‌కు కొంత‌ నిధులు ఇచ్చిన మాట వాస్త‌వ‌మేన‌ని, అయితే.. అది గెయిన్ ఆఫ్ ఫంక్ష‌న్ కాద‌ని చెప్పారని వార్తలు వచ్చాయి.

దీనిపై రిప‌బ్లిక‌న్ సెనేట‌ర్ కొన్ని రోజుల క్రితం స్పందించారు. ఫౌచీ అమెరిక‌న్ కాంగ్రెస్ కు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని, ఇది నేరం కిందికి వ‌స్తుంద‌ని, దీన్ని ఉప‌సంహ‌రించుకున్నారా లేదా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ఆ ప‌రిశోధ‌న ‘గెయిన్ ఆఫ్ ఫంక్ష‌న్‌’ కిందకే వస్తుందని అన్నారు. అంతేకాదు.. వుహాన్ ల్యాబ్ 2015, 2017లో ముద్రించిన రెండు పత్రాలను కూడా సెనెటర్ రేండ్ పాల్ ప్రస్తావించారు. ఈ విష‌యంలో ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త రిచ‌ర్డ్ ఎబ్రైట్ కూడా రేండ్ పాల్ విమ‌ర్శ‌ల‌కు మ‌ద్ద‌తు ల‌భించ‌డం గ‌మ‌నార్హం. పాల్ చెప్పిన రెండు రీసెర్చ్ ప‌త్రాల్లోనూ కొత్త వైర‌స్ లు పుట్టుకొచ్చిన‌ట్టు తేలింద‌ని స‌మాచారం. ఇది ఖ‌చ్చితంగా ‘గెయిన్ ఆఫ్ ఫంక్ష‌న్‌’ కిందకే వస్తుందని అంటున్నారు.

దీంతో.. కరోనాతోపాటు, వైరస్ ల తయారీ అంశం మరో మలుపు తిరిగింది. ఇన్నాళ్లూ చైనాను నిందించిన అమెరికా.. ఇప్పుడు వుహాన్ ల్యాబ్ కు నిధులు ఇచ్చింద‌నే చ‌ర్చ తెర‌పైకి రావ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కైతే క‌రోనా వైర‌స్ ఎలా వ‌చ్చింద‌న్న‌ది మాత్రం తేల‌లేదు. దీనికి.. గెయిన్ ఆఫ్ ఫంక్ష‌న్ కు ఏమైనా సంబంధం ఉందా? అన్న‌ది కూడా తెలియ‌లేదు. మరి, ఈ ప్ర‌శ్న‌ల‌కు భ‌విష్య‌త్ లో స‌మాధానం వ‌స్తుందేమో చూడాలి.
Tags:    

Similar News