ముద్రగడను అంటే జాతిని అన్నట్లే అంటున్న దాసరి

Update: 2016-06-17 17:51 GMT
సినిమాల గురించి.. సినిమా ఇండస్ట్రీ గురించి తరచూ మాట్లాడే దాసరి నారాయణ రావులోని మరో కోణం బయటకు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో విభజన లాంటి కొంపలు మునిగిపోయే వ్యవహారం జరిగినా ఒక్కరోజంటే ఒక్క రోజు కూడా బయటకు రాని ఆయన తాజాగా బయటకు వచ్చారు. తమ జాతి నాయకుడైన ముద్రగడ చేస్తున్న దీక్ష పట్ల ఏపీ సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై అగ్గి ఫైర్ అయ్యారు. ఏపీలోని ఇష్యూ గురించి హైదరాబాద్ లోని మరో ఏపీ నాయకుడు.. మాజీ మంత్రి అయిన పల్లంరాజు నివాసంలో భేటీ అయి తర్వాత మీడియాతో మాట్లాడారు.

ముద్రగడ ప్రాణాలతో చెలగాటం ఆడొద్దంటూ వ్యాఖ్యానించిన దాసరి.. మంత్రులు మాట్లాడే మాటలకు చంద్రబాబే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. మంత్రులే శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నట్లుగా విమర్శించారు. అవసరమైతే తామంతా రాజమండ్రికి వెళ్లి ముద్రగడను కలుస్తామన్నారు. జిల్లా ఎస్పీ.. కలెక్టర్ హామీ ఇవ్వటంతో ఒక సెలైన్ ఎక్కించుకున్నారని.. ఆ మాత్రానికే ముద్రగడ దీక్ష విరమించుకున్నట్లు హోం మంత్రి చినరాజప్ప ప్రకటించారన్నారు.

ఆరు రోజులు దీక్ష చేసినా వైద్య పరీక్షల్లో అన్ని నార్మల్ గానే ఎలా ఉన్నాయంటూ ఎటకారంగా మాట్లాడినట్లుగా దాసరి ఆరోపిస్తూ సీరియస్ అయ్యారు. ఈ తరహా విమర్శలు ముద్రగడ నిజాయితీని.. జాతి నిజాయితీని అవమానించటమే అన్నారు. ఈ విమర్శలు మంత్రులు చేసినవా? ముఖ్యమంత్రి చంద్రబాబు చేయించినవా? అంటూ ప్రశ్నించారు. ముద్రగడ ప్రాణాలతో చెలగాటం ఆడటానికి ఏ మంత్రి ప్రకటన  ఇచ్చినా దానికి చంద్రబాబుదే బాధ్యతగా ఆయన తేల్చి చెప్పారు. ఇంత ఆవేశం ఉన్న దాసరి.. జాతి ప్రయోజనాల కోసం ఏ విజయవాడలోనో.. రాజమండ్రిలోనే ఉండిపోవచ్చు కదా? అలా కాదని.. హైదరాబాద్ లో ఉండే దాసరి.. పక్క రాష్ట్రమైన ఏపీ ముచ్చట ఎందుకో..?
Tags:    

Similar News