పవన్ పాలిటిక్స్ మీద దాసరి ఏమన్నారు?

Update: 2016-05-02 17:15 GMT
కాసింత బోళాగా మాట్లాడే తత్వం ఉన్న దర్శకరత్న దాసరి నారాయణ రావు సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరి గురించైనా ఓపెన్ గా ఏదైనా వ్యాఖ్య చేయాలంటే ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. సినిమా రంగంలో సక్సెస్ ఫుల్ కావటంతో పాటు.. కాంగ్రెస్ సర్కారు హయాంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బొగ్గు కుంభకోణంలో బొగ్గు నుసి అంటుకొని దాసరి ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయిన పరిస్థితి.

అయితే... అదంతా తన  రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా కొట్టిపారేసే ఆయన మాటల్ని విన్నప్పుడు.. కాస్త ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి వచ్చేవారికి సలహాలు ఇవ్వనని చెప్పిన ఆయన.. రాజకీయాల్లోకి రావాలనుకునే వారు ఎలా ఉండాలన్న విషయం మీద వ్యాఖ్యలు చేయటం గమనార్హం. సున్నిత మనస్కులకు రాజకీయాలు సరిపోవన్న దాసరి.. పవన్ కు తాను సలహాలు ఇవ్వనని చెప్పారు.

సున్నిత మనస్కులైతే రాజకీయాల్లో అస్సలు రావొద్దని చెబుతున్న దాసరి.. ఒకవేళ సున్నిత మనస్కులు రాజకీయాల్లోకి వస్తే తన మాదిరి బురద అంటించుకోవటం తప్పించి మరింకేం ఉందన్నారు. పవన్ విషయానికి వస్తే తన మాదిరి సున్నిత మనస్కు ఆయనకు ఉండరన్న దాసరి ఆయనకు జన.. మనోబలం ఉందన్నారు.

రాజకీయాల్లో కొందరు విజయవంతం కావొచ్చన్న మాట చెప్పిన దాసరి.. పవన్ ధైర్యాన్ని తాను వెనక్కి లాగనని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో పవన్ సక్సెస్ అవుతారన్న ఆశాభావాన్ని దాసరి వ్యక్తం చేశారు. మొత్తమ్మీదా పవన్ మీద దాసరి చాలానే నమ్మకం పెట్టుకున్నట్లు అనిపించక మానదు.
Tags:    

Similar News