కేసీఆర్‌... ధుర్యోధ‌నుడా?

Update: 2018-03-30 11:03 GMT
తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల‌పై టీ కాంగ్రెస్ పార్టీ కాసేప‌టి క్రితం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. బ‌డ్జెట్ స‌మావేశాల్లో విప‌క్షం లేకుండా చేసే వ్యూహాన్ని అమ‌లు చేసిన అధికార టీఆర్ ఎస్ పార్టీ త‌న‌కు అనుకూలంగా ఉన్న బిల్లుల‌కు ఆమోదం కోస‌మే ఈ త‌ర‌హా వ్యూహాన్ని అమలు చేసింద‌ని కూడా ఆ పార్టీ ఆరోపించింది. ఇందుకోస‌మే త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను స‌భ నుంచి స‌స్పెండ్ చేసేలా వ్యూహం ర‌చించింద‌ని - ఆ వ్యూహాన్ని ప‌క్కాగా అమ‌లు చేయ‌డం ద్వారా కేసీఆర్ తాను అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించార‌ని కూడా ఆ పార్టీ ఆరోపించింది. తాము రూపొందించుకున్న బ‌డ్జెట్ ప‌ద్దుల‌కు ఎలాంటి ఆటంకం లేకుండా ఆమోదం ల‌బించడం కోస‌మే సీఎం కేసీఆర్ ఈ వ్యూహాన్ని అమ‌లు చేశార‌ని కూడా టీ కాంగ్రెస్ ఆరోపించింది.

ఈ దిశ‌గా కాసేప‌టి క్రితం మీడియా ముందుకు వ‌చ్చిన టీ కాంగ్రెస్ అదికార ప్ర‌తినిధి దాసోదు శ్ర‌వ‌ణ్... తెలంగాణ స‌ర్కారుపైనే కాకుండా సీఎం కేసీఆర్ పైనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ బిల్లుల‌కు ఎలాంటి అవరోధం రాకూడ‌ద‌న్న ఒకే ఒక్క భావ‌న‌తోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను స‌భ నుంచి స‌స్పెండ్ చేశార‌ని శ్ర‌వ‌ణ్ ఆరోపించారు. కాంగ్రెస్ స‌భ్యులు లేని స‌భ‌లో కేసీఆర్ స‌ర్కారుది తిరుగులేని మెజారిటీనేన‌ని, ఆ మెజారిటీతో త‌మ బిల్లుల‌కు ప్ర‌భుత్వం ఆమోదం పొందింద‌న్నారు. మొత్తంగా త‌న‌కు అడ్డంకిగా ఉన్నందునే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను టీఆర్ ఎస్ స‌ర్కారు బ‌య‌ట‌కు పంపేసి.. ఆ త‌ర్వాత తమ బిల్లుల‌కు ఆమోదం పొందింద‌న్నారు. 13 రోజులుగా సాగిన అసెంబ్లీ స‌మావేశాల్లో 61 గంట‌ల పాటు స‌భా కార్య‌క్ర‌మాల‌ను దుర్వినియోగం చేసిన అదికార పార్టీ... ఆ స‌మ‌యాన్ని కేవ‌లం కేసీఆర్ ను కీర్తించేందుకే వినియోగించింద‌ని శ్ర‌వ‌ణ్ ఆరోపించారు. ఈ స‌మ‌యంలో సింగిల్ మినిట్ కూడా ప్ర‌జా స‌మస్య‌ల‌పై చ‌ర్చ జ‌రిగిన పాపాన పోలేద‌ని, ఇదెక్క‌డి ప్ర‌జాస్వామ్య‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ప్రదాన ప్ర‌తిప‌క్షం లేకుండానే కీల‌క బిల్లులైన పంచాయ‌తీరాజ్‌ - ప్రైవేట్ వ‌ర్సిటీలు - అసైన్డ్ భూములకు చెందిన బిల్లుల‌ను ఏలా ఆమోదిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ త‌ర‌హాలో స‌భ‌లో వ్య‌వ‌హ‌రించారంటే నిజంగానే అధికార పార్టీ నేత‌ల‌తో పాటు సీఎం కేసీఆర్ సిగ్గు ప‌డాల్సి ఉంద‌న్నారు. అంత‌టితో ఆగ‌ని శ్ర‌వ‌ణ్‌.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాన్ని ధుర్యోధ‌నుడి స‌భ‌తో పోల్చారు. త‌న‌కు ఎదురు తిరిగే వారినిచ లేకుండా చేసేసి... ఆ త‌ర్వాత తీర్పులు వెలువ‌రించే ధుర్యోద‌నుడి మాదిరిగా కేసీఆర్ కూడా ప్ర‌ధాన విప‌క్షాన్ని స‌భ నుంచి బ‌య‌ట‌కు గెంటేసి... ఆ త‌ర్వాత కీల‌క బిల్లుల‌కు ఆమోదం పొందార‌న్నారు. మొత్తంగా ఈ ఒక్క మాట‌తో కేసీఆర్‌ ను ధుర్యోధ‌నుడితో పోల్చిన శ్ర‌వ‌ణ్‌.. అధికార పార్టీపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డార‌నే చెప్పాలి.
Tags:    

Similar News