ప్ర‌జాద‌ర్బార్ ను ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌!

Update: 2019-06-29 06:30 GMT
పాల‌న‌లో త‌న తండ్రి మార్క్ ను ప్ర‌ద‌ర్శిస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజాగా తన తండ్రి మార్క్ అయితే ప్ర‌జాద‌ర్బార్ ను షురూ చేస్తున్నారు. దివంగ‌త మ‌హానేత వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న రోజుల్లో ప్ర‌తి రోజూ ఉద‌యం ప్ర‌జాద‌ర్బార్ ను నిర్వ‌హించేవారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డెక్క‌డి వారంతా సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకొని త‌మ స‌మ‌స్య‌ల్ని చెప్పుకునేవారు.

ఒక‌వేళ ఏదైనా స‌మ‌స్య అక్క‌డిక‌క్క‌డే పూర్తి చేసే అవ‌కాశం ఉంటే.. వెంట‌నే దాన్ని పూర్తి చేసేవారు. వైఎస్ ప్ర‌జాద‌ర్బార్ కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ల‌భించ‌ట‌మేకాదు.. ఆ సంద‌ర్భంగా వైఎస్ రియాక్ట్ తీరును ప్ర‌జ‌లు అస్స‌లు మ‌రిచేవారు కాదు. వైఎస్ త‌ర్వాత ముఖ్య‌మంత్రులు ఎవ‌రూ ప్ర‌జాద‌ర్బార్ ను నిర్వ‌హించేవారు కాదు.

ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న వేళ‌లోనూ తాను పులివెందుల‌లో ఉన్న ప్ర‌తి రోజూ ప్ర‌జ‌ల్ని క‌లుసుకుంటూ.. వారి స‌మ‌స్య‌ల మీద దృష్టి పెట్టేవారు. త‌న‌కున్న అవ‌కాశాల మేర‌కు కొన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ఇచ్చేవారు. తాజాగా ఏపీ సీఎం హోదాలో ప్ర‌జాద‌ర్బార్ ను షురూ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు జ‌గ‌న్‌.

జులై ఒక‌టి నుంచి ప్ర‌తి రోజూ ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ప్ర‌తి రోజూ తాడేప‌ల్లిలోని త‌న నివాసంలో గంట పాటు ప్ర‌జాద‌ర్బార్ ను నిర్వ‌హిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను సీఎం క్యాంప్ ఆఫీసు చేస్తోంది. జ‌గ‌న్ తాజా నిర్ణ‌యం ఆంధ్ర రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. సీఎంను సామాన్యుడు నేరుగా క‌లిసి త‌న స‌మ‌స్య‌ను చెప్పుకునే అవ‌కాశాన్ని జ‌గ‌న్ క‌ల్పిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

   

Tags:    

Similar News