స్త్రీకి స్త్రీయే శత్రువు అనేది నానుడి... ఇంతకాలం ఈ నానుడి నిజమో కాదో తెలియదు కానీ... తాజాగా జరిగిన సంఘటన చూస్తే కచ్చితంగా ఇదే అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఒక స్త్రీ అత్త అయితే.. మరో స్త్రీ కోడలు! కోడలైన రేపటి అత్తే... అన్న విషయం మరిచిందో ఏమో, అత్తగారు కూడా తన భర్త తల్లే అని జ్ఞానం లేదో ఏమో కానీ... పక్షవాతం వచ్చిన అత్తగారిపై దౌర్జన్యానికి దిగింది ఒక కోడలు. వృద్దురాలి అని జాలి లేదు, సాటి మహిళ కదా అనే ఆలోచనా లేదు, అత్తగారు అన్న ఇంగితం అస్సలే లేదు! మంచంపై పడి కదలడానికి ఇబ్బంది పడే వృద్దురాలైన అత్తగారిని మంచంపై నుండి కిందకి తోసెయ్యడం, గాయపరచడం వంటివి చేస్తుంది ఒక కోడలు! సీసీ టీవీలో రికార్డైన ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది!
వివరాళ్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ లోకి కౌశంబిలో వృద్దురాలైన ఒక మహిళ పక్షవాతం బారిన పడటంతో కొడుకు కోడలు వద్దే ఉంటుంది. ఒకరోజు బయటనుండి వచ్చిన కొడుక్కి తల్లి ఒంటిపై గాయాలు కనిపించాయి. అడిగినా చెప్పలేని పరిస్థితి తల్లిది... అడగకపోయినా సమర్ధించుకునే తెలివి భార్యది. దీంతో అసలు విషయం తెలుసుకుందామనుకున్న ఆ కొడుకు... సీక్రెట్ గా తల్లి గదిలో సీసీ కెమేరా అమర్చాడు. ఆ రోజు సాయంత్రం వచ్చి సీసీ టీవీ ఫుటేజ్ చూసిన కుమారుడుకి అసలు విషయం అర్ధం అయ్యింది. విచక్షణా రహితంగా తల్లి లాంటి అత్తగారిని కొడుతున్న దృశ్యాలు చూసాడు. తల్లా పెళ్లమా అని ఆలోచించలేదు.. ఉన్నఫలంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోజు రోజుకీ వృద్దులపై పెరిగిపోతున్న దాడులు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో ఇది ఒకటి మాత్రమే... ఇలాంటివి ఎన్నో సంఘటనలు. ఏది ఏమైనా... ఆ కుమారుడి చొరవకు, తీసుకున్న నిర్ణయానికి పలువురు అభినందిస్తున్నారు!