ఇల్లు కూల్చి తల్లి శవానికి అంత్యక్రియలు

Update: 2016-09-26 06:50 GMT
భార్య శవాన్ని మోసుకుంటూ స్వగ్రామానికి కాలినడకన బయలుదేరిన ఒడిశా గిరిజనుడు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు తెర తీసిన విషయం తెలిసిందే. దాని వెనుక కారణం ఏదైనా కూడా మృతదేహాలను తరలించడం - దహన సంస్కారాలు చేయడంలోనూ ఒడిశాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని.. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ప్రపంచం ఘోషించింది. ఇప్పుడు అదే ఒడిశాలో అలాంటిదే ఇంకో సంఘటన జరిగింది. తల్లి శవాన్ని దహనం చేయడానికి ఎవరూ రాకపోవడంతో నలుగురు కుమార్తెలు విధి లేని పరిస్థితిలో తమ ఇంటిని కూల్చి ఆ కలపతో తల్లి శవానికి దహన సంస్కారాలు చేసిన ఘటన వెలుగు చూసింది.

ఒడిశాలోని కలహండి జిల్లా దోక్రిపాడ గ్రామంలో కనక సతపతి అనే 75 ఏళ్ల వృద్ధురాలు సుదీర్ఘ అనారోగ్యం తరువాత శుక్రవారం రాత్రి మరణించింది. ఆమెకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. తల్లి అంత్యక్రియలకు సహాయం చేయాల్సిందిగా వారు ఇరుగుపొరుగు వారిని వేడుకున్నారు. అయితే ఎవరూ ముందుకు రాకపోవడంతో వారు తమ తల్లి మృతదేహాన్ని మంచంపై ఉంచి శ్మశానానికి మోసుకు వెళ్లారు.

ఆ తరువాత మృతదేహాన్ని దహనం చేయడానికి కలప కూడా వారికి కరవైంది. దాంతో చేసేదేమీ లేక తమ ఇంటిపైకప్పు కూల్చివేసి ఆ కలపతో తల్లికి దహన సంస్కారాలు చేశారు. నిరుపేదలు, గిరిజనులకు కనీస వసతులు కూడా దక్కని పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు ప్రభుత్వాలను ఏమాత్రం కదిలించలేకపోతున్నాయి.

Full View
Tags:    

Similar News