సాయ‌న్న సీటు కోసం.. కుమార్తెల ఫైటింగ్‌.. కంటోన్మెంట్ రాజ‌కీయం గ‌రంగ‌రం!

Update: 2023-04-20 06:00 GMT
ఈ ఏడాది న‌వంబ‌రులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. దీంతో అధికార పార్టీ నాయ‌కులు పెద్ద ఎత్తున సీట్ల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదిలావుంటే, రాజ‌ధాని భాగ్య‌న‌గ‌రంలోని ఏకైౖక ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్‌ సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున జి. సాయన్న విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌తంలోనూ ఆయ‌న ఇక్క‌డ గెలిచారు. పార్టీ ఏదైనా ఆయ‌న గెలుపు మాత్రం ప‌క్కా అనే రేంజ్‌లో ఇక్క‌డ రాజ‌కీయాలు సాగాయి.

అయితే.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో 72 ఏళ్ల సాయ‌న్న అనారోగ్యం కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో వాస్త‌వానికి ఇక్క‌డ ఉప ఎన్నిక రావాల్సి ఉంది. కానీ, ఎలానూ జ‌న‌ర‌ల్ ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ఇక్క‌డ ఒకే సారి న‌వంబ‌రులో అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. అయితే.. సాయ‌న్న‌ మరణంతో ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది.  సాయన్న లేని లోటును భర్తీ చేయడం బీఆర్‌ఎస్‌కి సవాలుగా మారింది.

ఇక‌, సాయ‌న్న‌కు వార‌సులు లేరు. ఉన్న‌ది ముగ్గురు ఆడ‌పిల్ల‌లే. నమ్రత, లాస్యనందిత, నివేదిత. వీరు తమ తండ్రి సీటు కోసం అప్పుడే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఎవ‌రికి వారు త‌మ త‌మ ప‌ర‌ప‌తిని వినియోగించి.. కేసీఆర్‌ను మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ముఖ్యంగా మ‌ధ్య‌లో అమ్మాయి లాస్యనందిత తీవ్రంగా శ్ర‌మిస్తున్నార‌ని తెలుస్తోంది. గతంలో కవాడిగూడ డివిజన్‌ నుంచి బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

అయితే మరుసటి ఎన్నికల్లో ఆమె ఓటమి చవి చూశారు. సాయన్న వారసురాలిగా లాస్యనందితను ప్రకటిస్తే కంటోన్మెంట్‌ ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని, వచ్చే ఎన్నికల్లో విజయం సులభం అవుతుందని ఆమె అను కూల వ‌ర్గం అభిప్రాయపడుతోంది.

ఇక‌, లాస్య కూడా.. నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంటున్నారు. ప్ర‌జ‌ల‌కు ఏ అవ‌స‌రం వ‌చ్చినా క‌లుస్తున్నారు. మ‌రోవైపు.. నివేదిత, న‌మ్ర‌త కూడా  బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారని సాయన్న అనుచరులు చెబుతున్నారు. దీంతో ఈ కుటుంబంలో కంటోన్మెంట్ పాలిటిక్స్ పీక్ స్టేజ్‌కు చేరాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి కేసీఆర్ ఎవరిని క‌రుణిస్తారో చూడాలి.

సాయ‌న్న హిస్ట‌రీ ఇదీ..

+ దివంగత ఎమ్మెల్యే సాయన్న తొలిసారిగా 1994లో కంటోన్మెంట్‌ టీడీపీ నుంచి విజయం సాధించారు. 1999, 2004లోనూ విజయాలు అందుకున్నారు.
+ 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి పి.శంకరరావు చేతిలో ఓడిపోయారు.
+ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు.
+ 2016లో టీఆర్‌ఎస్‌లో చేరారు.
+ 2018 ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి విజయం సాధించారు. 

Similar News