సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి తప్పించడంపై డేవిడ్ వార్నర్ స్పందన

Update: 2021-11-16 17:30 GMT

ప్రపంచకప్ టీ20 ప్రారంభానికి ముందు వరకూ ఫామ్ లో లేక ఆపసోపాలు పడిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మొదటి మ్యాచ్ నుంచి గేర్ మార్చి ఫాంలోకి వచ్చి ఏకంగా తన టీంకు ప్రపంచకప్ ను అందించాడు. టీ20 వరల్డ్ కప్ లో ఏకంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ప్రస్తుతం ఇతడే హాట్ టాపిక్ గా మారాడు.

ఐపీఎల్ లో పేలవమైన ఫామ్ కారణంగా నెటిజన్లు డేవిడ్ వార్నర్ ను నిరంతరం ట్రోల్ చేశారు. అయితే ఈ ఆటగాడు మాత్రం టీ20 ప్రపంచకప్ లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అందరి నోళ్లు మూయించాడు. ఆస్ట్రేలియాను ప్రపంచ ఛాంపియన్ గా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు.

ఫైనల్ లో న్యూజిలాండ్ పై వార్నర్ అద్భుతమైన అర్థ సెంచరీ సాధించి విజయానికి బాటలు వేశాడు. వార్నర్ ప్రదర్శన చూసిన తర్వాత ఐపీఎల్ లో అతడిని కెప్టెన్సీ నుంచి తీసేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

డేవిడ్ వార్నర్ పేలవ ఫామ్ కారణంగా ఐపీఎల్ 2021 సమయంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ నుంచి తొలగించి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలయంసన్ ను కెప్టెన్ ను చేసింది. చివరి మ్యాచ్ లలో అయితే డేవిడ్ వార్నర్ ను టీంలోంచి కూడా తీసేసి ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తనను తొలగించడంపై డేవిడ్ వార్నర్ తాజాగా స్పందించాడు. సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘కొన్నేళ్లుగా ఎంతో ఇష్టపడిన టీం ఏ కారణం లేకుండా నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడం.. టీం నుంచి తొలగించడం చూస్తే చాలా బాధ కలిగింది. దీనికి కారణం ఏదైనా కావచ్చు.కానీ నేను ఆ ఫ్రాంచైజీ కోసం నిరంతరం కష్టపడ్డా.. ఒక్కరోజు కూడా తప్పకుండా ప్రతీరోజు ప్రాక్టీస్ చేశా. ఐపీఎల్ లో నాకు ఇంకో అవకాశం ఉందని భావిస్తున్నా’ అని వార్నర్ ఇక తన ప్రయాణం ఎస్ఆర్.హెచ్ తో ముగిసిందని చెప్పకనే చెప్పాడు.
Tags:    

Similar News