కొడుకును చూసి కన్నీరు కారుస్తున్న దావూద్

Update: 2017-11-26 11:46 GMT
సాధార‌ణంగా త‌ల్లిదండ్రులకు ఎలాంటి కోరిక ఉంటుంది...మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి...త‌నంత తానుగా బ‌తికేలా ఉండాలి...వీలైతే ప‌దిమందితో గుర్తింపు పొందాలి. కానీ  అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం మాత్రం త‌న కొడుకులు త‌న ప‌రువుతీస్తున్నార‌ని వాపోతున్నార‌ట‌. ఎందుకంటే... దావూద్ ఇబ్రహీం విషయంలో అంచనా రివర్సయింది. డాన్ అవుతాడనుకున్న కొడుకు ఇప్పుడు ఓ ముస్లిం మత పెద్దగా మారాడు. అది చూసి కుళ్లికుళ్లి ఏడుస్తున్నాడట దావూద్. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తన అండర్ వరల్డ్‌ను చూసుకునేది ఎవరంటూ దావూద్ ఎప్పుడూ ఫీలవుతుంటాడని, ఇదే అతన్ని కుంగిపోయేలా చేసిందని ఇక్బాల్ విచారణలో భాగంగా వెల్లడించాడు. దీనికితోడు అతని పెద్ద తమ్ముడు అనీస్ ఇబ్రహీం కూడా వయసు మీద పడటంతో వ్యాపారాన్ని చూసుకోలేకపోతున్నాడు. ఇతర తమ్ముళ్ల పరిస్థితీ ఇలాగే ఉంది.

స‌హ‌జంగా...ఓ క్రికెటర్ కొడుకు క్రికెటర్ కావడం.. ఓ సినిమా హీరో కొడుకు హీరోనే కావడం సహజం. పేరెంట్స్ కూడా అదే కోరుకుంటారు. అలాగే ఓ అండర్ వరల్డ్ డాన్ కూడా తన కొడుకు మరో డాన్ కావాలనే అనుకుంటాడు కదా. కానీ దావుద్ సీన్ రివ‌ర్స‌యింది. గత కొన్నేళ్లుగా దావూద్ కొడుకు కుటుంబాన్ని, వేల కోట్ల వ్యాపారాన్ని వదిలేసి వేరుగా ఉంటున్నాడు. అయితే దావుద్ ఒక్కగానొక్క కొడుకు తన వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకోకుండా ఇలా మత పెద్దగా మారడం దావూద్‌కు మింగుడు పడటం లేదని పోలీసులు వెల్లడించారు. మొయిన్ అనే ఆ 31 ఏళ్ల దావూద్ కొడుకు.. తన తండ్రి అక్రమ వ్యాపారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడని, అతనికి పూర్తి విరుద్ధంగా ఉంటాడని థానె దోపిడీ నిరోధక సెల్ హెడ్ ప్రదీప్ శర్మ తెలిపారు. దావూద్ తమ్ముడు ఇక్బాల్ ఇబ్రహీం విచారణలో భాగంగా ఈ విషయంతోపాటు దావూద్ ఇంటి గొడవలన్నీ బయటపడుతున్నాయని ఆయన చెప్పారు.

పవిత్ర ఖురాన్‌లోని 6236 పద్యాలను నేర్చుకొని మొయిన్ ఇప్పుడు ఓ మౌలానాగా మారాడని ఇక్బాల్ పోలీసుల విచారణలో తెలిపాడు. కరాచీలోని వందల కోట్ల విలువైన లగ్జరీ ఇంట్లో కాకుండా ఆ పక్కనే ఉన్న మసీదులో ఓ సాధారణ వ్యక్తిలా జీవితం గడుపుతున్నాడు మొయిన్. అతనితోపాటు భార్య, ముగ్గురు పిల్లలు కూడా అక్కడే ఉంటుండటం గమనార్హం. చిన్న పిల్లలకు ఖురాన్ చెప్పడం, వాళ్లకు ఇస్లాం మత గొప్పదనాన్ని వివరించడంలాంటి పనులు అతను చేస్తుంటాడు. అంతకుముందు మొయిన్ ఒక బిజినెస్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్. తండ్రికి వ్యాపారంలో సాయపడేవాడు. కానీ నెమ్మదిగా అల్లా పిలుపు మేరకు ఇలా మౌలానాగా మారాడు.

2011లో కరాచీకి చెందిన ఓ బడా వ్యాపారవేత్త కూతురైన సానియా షేక్‌ను అతను పెళ్లి చేసుకున్నాడు. మొయిన్ అక్క మహ్రుక్ 2006లో పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియందాద్ కొడుకు జునైద్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దావూద్ కరాచీలో ఉన్నాడని, పాకిస్థాన్ ఏజెన్సీలు అతనికి సహకరిస్తున్నాయని విచారణలో అతని తమ్ముడు ఇక్బాల్ చెప్పాడు. ఈ విచారణలో దావూద్ కుటుంబానికి సంబంధించి మరిన్ని వివరాలు అతని నుంచి రాబట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, దావూద్ జీవితాన్ని ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డం వ‌ల్లే...ఇలాంటి జీవితాన్ని ఆయ‌న కుమారుడు ఎంచుకున్నాడ‌ని అంటున్నారు.
Tags:    

Similar News