`లేడీస్ వింగ్` తో డీ గ్యాంగ్ దోపిడీ?

Update: 2017-12-08 11:28 GMT
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు. త‌న మాఫియా సామ్రాజ్యంతో ముంబై పోలీసులను గ‌డ‌గ‌డ‌లాడించిన ఈ నొటోరియ‌స్ గ్యాంగ్ స్ట‌ర్ కు ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు ఉంది. బాలీవుడ్ లోని ప‌లువురు సినీతార‌లు,సెల‌బ్రిటీల‌తో పాటు వ్యాపార‌స్థులంద‌రూ దావూద్ బాధితులే. 1993 ముంబై పేలుళ్ల‌తో భార‌త్ లో మార‌ణ‌హోమం రేపిన దావూద్...దాయాది దేశం పాకిస్థాన్ లో న‌క్కి త‌న ఆప‌రేష‌న్స్ ను కొన‌సాగిస్తున్నాడు. కొంత‌కాలంగా దావూద్ అనారోగ్యానికి గుర‌య్యాడ‌ని, అందువ‌ల్లే భార‌త ప్ర‌భుత్వానికి లొంగిపోబోతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ ప్ర‌కారం దావూద్ బీజేపీ స‌ర్కార్ తో సంప్ర‌దింపులు కూడా జ‌రిపాడ‌ని వదంతులు వినిపించాయి. అయితే, దావూద్ స్త‌బ్ద‌త వెనుక ఓ పెద్ద మాస్ట‌ర్ ప్లాన్ ఉన్న‌ట్లు తాజాగా నిఘా వ‌ర్గాలు అనుమానిస్తున్నాయి. దావూద్ నివురుగ‌ప్పిన నిప్పులా త‌న కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగించేందుకు స‌రికొత్త మార్గాల‌ను అన్వేషించాడ‌ని నిఘా అధికారులు భావిస్తున్నారు. దావూద్ తన టీమ్‌లో ప్ర‌త్యేకంగా ఓ మహిళల విభాగాన్ని ఏర్పాటు చేశాడ‌ని వారు అనుమానిస్తున్నారు. సాధార‌ణంగా గ్యాంగ్ స్ట‌ర్ లు మ‌హిళ‌ల‌ను త‌త ఆప‌రేష‌న్స్ కోసం ఉప‌యోగించరు. ఆ మాట‌కొస్తే త‌మ టీమ్ లో మ‌హిళ‌లు ఉండ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఒకవేళ ఉన్నా వారిని ఇత‌ర‌త్రా అవ‌స‌రాల‌కు వాడుకుంటారు త‌ప్ప బ‌య‌ట వ‌సూళ్ల‌కు పంపరు. కానీ, దావూద్ రూటు సెప‌రేటుగా ఉన్న‌ట్లు నిఘా అధికారులు అనుమానిస్తున్నారు.

మహిళలను బెదిరించేందుకు, వారి నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసేందుకు లేడీస్‌ వింగ్ ను దావూద్ ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. ఓ స్ప‌ష్ట‌మైన ఉద్దేశంతోనే ఈ వింగ్ లో మ‌హిళ‌ల‌ను ఎంచుకున్నాడ‌ని అనుకుంటున్నారు. ఆఖ‌రికి దావూద్ తన అక్రామాల‌కు ఆడ‌వాళ్ల‌ను కూడా ఎర వేస్తున్నాడ‌ని వారు అనుమానిస్తున్నారు. డీ గ్యాంగ్ లోని కొంత‌మంది మహిళా సభ్యుల ఫోన్ సంభాష‌ణ‌లను నిఘా వర్గాలు విశ్లేషించాయి. ఆ కాల్స్ లో అధికారులు విస్తుపోయే విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. కొంత‌మంది మహిళల నుంచి డ‌బ్బు క‌లెక్ట్ చేయ‌డ‌మే ఈ లేడీస్ వింగ్ మిషన్. అంతేకాదు, త‌మ వ‌సూళ్ల దందా గురించిన స‌మాచారాన్ని దావూద్ కు చేర‌వేయ‌డం వీరి డ్యూటీ. ఈ లేడీస్‌ వింగ్ వ్య‌వ‌హారాల‌ను ఉస్మాన్‌ అనే తన సన్నిహితుడికి చోటా షకీల్ అప్ప‌గించిన‌ట్లు నిఘా వ‌ర్గాలు భావిస్తున్నాయి. త‌న కెరీర్ లో ఈ త‌ర‌హా లేడీస్ వింగ్ గురించి విన‌లేద‌ని మాజీ ఐపీఎస్‌ అధికారి పీకే జైన్ అన్నారు. దావూద్ త‌న మాఫియా కెరీర్ చ‌ర‌మాంకానికి చేరుకున్నాడ‌నేందుకు ఈ లేడీస్ వింగే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. త‌న‌కు పాక్  ఫోన్‌ నెంబర్ల నుంచి రూ కోటి డిమాండ్‌ చేస్తూ కాల్స్‌ వచ్చాయని ముంబైలో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. అంతేకాకుండా, ఇపుడు దావూద్ బిట్‌కాయిన్స్ రూపంలో  లావాదేవీలు చేస్తున్నాడ‌ని నిఘా అధికారులు అనుమానాలు వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News