ఉగ్రవాదికి ప్రభుత్వ భద్రత ??​

Update: 2015-11-03 09:36 GMT
అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదిగా భారత్‌ పేర్కొంటున్న అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు ఛోటా రాజన్‌ అరెస్టు తరువాత పాకిస్తాన్‌ భద్రతను మరింత పెంచింది. పాకిస్తాన్‌ సైన్యానికి చెందిన స్పెషల్‌ కమాండోలను కరాచీలోనూ, ఇస్లామాబాద్‌ లోనూ ఉన్న దావూద్‌ ఇళ్ల వద్ద ప్రత్యేకంగా నియమించారట.  1993లో ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో ప్రధాన నిందితుడైన దావూద్‌ ఆ తరువాత పాకిస్తాన్‌ లో నివాసం ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాకిస్థాన్ ఆయన్ను కాపాడుకుంటూ వస్తోంది. దావూద్ మధ్యలో కొద్దికాలం దుబాయిలో ఉన్నా అది సురక్షితం కాదన్న భావనతో తిరిగి పాక్ లోనే మకాం వేశాడు.

ఒకప్పుడు తన వద్దే పనిచేసిన రాజన్ అనంతరం సొంతంగా పెద్ద డాన్ గా ఎదిగిన తరువాత రెండు వర్గాల మధ్య ఆధిపత్యం పోరు నడిచింది. ఈ క్రమంలో రెండువైపులా పలువురు చనిపోయారు. కొద్దికాలంగా రాజన్ యాక్టివ్ లేకపోగా ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. అయితే... రాజన్ పోలీసుల అదుపులో ఉన్నాడని నిర్లక్ష్యంగా ఉంటే అలాంటి సమయంలో దావూద్ పై దాడులు జరగొచ్చని పాక్ భావిస్తోందట. అందుకే దావూద్ కు రక్షణ పెంచింది.

మరోవైపు అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటారాజన్‌ ను ఈ రోజు రాత్రి ఇండోనేషియా నుంచి భారత్‌ కు తీసుకురానున్నారు. జకార్తా ఇంటర్‌ పోల్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది. జకార్తా ఇంటర్‌ పోల్‌ అధికారులు డెన్స్‌ పార్‌ ఇమిగ్రేషన్‌ అధిపతితో కలిసి బాలి పోలీస్‌ కేంద్రకార్యాలయంలో ప్రశ్నించారు. అనంతరం అతడు దేశంనుంచి వెళ్లడానికి అవసరమైన అనుమతులు మంజూరు చేశారు. ఛోటారాజన్‌ రాత్రికి ముంబై చేరుకుంటాడనీ, అతడికి ఆర్థర్‌ రోడ్‌ లోని జైలులో అండాసెల్‌ లో ఉంచే అవకాశాలున్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ చెబుతున్నారు.
Tags:    

Similar News