మోదీ నిజ‌స్వ‌రూపం తెలిసిపోయింది!

Update: 2017-09-03 11:58 GMT

మోదీ నిజ‌స్వ‌రూపం తెలిసిపోయింది!  ఆయ‌న‌కు రైతులంటే లెక్క‌లేదు. వారికి సేవ చేయాల‌న్న ధ్యాసే లేదు. కేవ‌లం ప‌న్నులు పెంచ‌డం - ప్ర‌జ‌ల‌నుంచి సొమ్ములు దండుకోవ‌డం ఒక్క‌టే మోదీకి తెలిసింది.  నిజానికి ఆయ‌న‌లాంటి వ్య‌క్తిపై రైతులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నందుకు వారి ఖ‌ర్మ వారు అనుభ‌వించాల్సిందే!!  కేంద్రంలో ఉన్న మంత్రులు సైతం ప్ర‌ధాని మోదీకి భ‌య‌ప‌డుతూ బ‌తుకుతున్నారు. ఇప్పుడు ఈ మాట‌లు అంటున్న‌ది ఎవ‌రో విప‌క్ష ఎంపీనో.. కాంగ్రెస్ ఎంపీనో కాదు! సాక్షాత్తూ.. బీజేపీ ఎంపీ! న‌మ్మ‌శ‌క్యం కాకున్నా న‌మ్మి తీరాల్సిందే. అవును.. బీజేపీ ఎంపీనే ఇప్పుడు ప్ర‌ధాని మోదీ స‌హా ఆయ‌న పాల‌న‌పై నిప్పులు కురిపిస్తున్నారు.

మ‌హారాష్ట్ర‌లోని గోండియా-భందారా నియోజకవర్గం నుంచి ప్రాధినిథ్యం వ‌హిస్తున్న ఎంపీ నానా ప‌టోల్‌.. ప్ర‌ధాని మోదీపై విరుచుకుప‌డ్డారు. ప్రభుత్వ వ్యూహాల గురించి ఎవ‌రైనా  ప్రశ్నిస్తే మోదీకి  తిక్క‌రేగుతుంద‌ని, ఇక‌, ఆ స‌మ‌యంలో ఆయ‌న ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడ‌తార‌ని చెప్పారు. ఇటీవ‌ల జ‌రిగిన బీజేపీ ఎంపీల సమావేశంలో తాను రైతుల సమస్యలను లేవనెత్తగా మోదీ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. గ్రీన్‌ ట్యాక్స్‌ ను పెంచాలని, వ్యవసాయ రంగాల్లో కేంద్రం పెట్టుబడులను పెంచాలని, ఓబీసీలకు ప్రత్యేకంగా శాఖను ఏర్పాటు చేయాలని తాను సమావేశం మాట్లాడానని తెలిపారు. తన ఆలోచనలను అభినందించని మోదీ.. 'కొంచెం నోరు మూసుకుంటావా' అని గ‌ద్దించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అదేస‌మ‌యంలో మోదీ. 'మీరు పార్టీ మ్యానిఫెస్టోను చదివారా?.. ప్రభుత్వ పథకాల గురించి మీకు తెలుసా?' అని   తనను ప్రశ్నించారని తెలిపారు.  పార్టీ తనను టార్గెట్‌ చేసిందని ప‌టోల్ పేర్కొన్నారు. అయినా కూడా తనకేం భయం లేదని  చెప్పారు. కేంద్రంలో ప్రస్తుతం ఉన్న మంత్రులు భయంతో బతుకుతున్నారని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగా, ప‌టోల్ కామెంట్ల‌పై స్పందించేందుకు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నిరాకరించారు.  ఇక‌, ఇప్పుడు ఈ విష‌యం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. నిజానికి మూడేళ్ల మోదీ పాల‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కు నోరెత్తి విమ‌ర్శ చేసిన నేత కానీ, నాయ‌కుడు కానీ లేరు. అలాంటిది ఇప్పుడు సొంత పార్టీలోనే ముస‌లం పుడుతుండ‌డం, మోదీ పేరును బ‌జారున ప‌డేయ‌డం ఎంత వ‌ర‌కు దారి తీస్తుందో చూడాలి.
Tags:    

Similar News