ముకుల్ రాయ్‌ పై చెయి వేయ‌డం కుద‌ర‌దంతే!

Update: 2017-11-05 09:34 GMT
ఇప్పుడు దేశంలో ఎక్క‌డ చూసినా పార్టీ ఫిరాయింపులే క‌నిపిస్తున్నాయి. అది స్థానిక సంస్థ‌ల స్థాయి అయినా, జిల్లా స్థాయి అయినా, రాష్ట్ర స్థాయి అయినా... చివ‌రికి జాతీయ స్థాయి అయినా కూడా పార్టీ ఫిరాయింపుల‌కు అడ్డే లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల‌కు ముందుగా కేసీఆర్ శ్రీ‌కారం చుట్ట‌గా... ఆ త‌ర్వాత న‌వ్యాంధ్ర‌లో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు మ‌రింత‌గా జోరు పెంచారు. ఇక రాజ‌కీయంగా చాలా ప‌రిప‌క్వ‌త క‌నిపించే త‌మిళ‌నాడులోనూ ఫిరాయింపు రాజ‌కీయాల‌కు అడ్డే లేకుండా పోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. మొన్న‌టికి మొన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా... ఓ రెండు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్థాయిలో సంఖ్యాబ‌లం లేకున్నా కూడా బీజేపీ దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ ప‌రిణామం నిజంగానే జాతీయ రాజ‌కీయాల‌ను దిగ్భ్రాంతికి గురి చేసింద‌నే చెప్పాలి. గ‌తంలో ఏ ఒక్క పార్టీ కూడా ఇంత‌గా బ‌రి తెగించిన దాఖ‌లాలే లేవ‌నే చెప్పాలి.

ఇక ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే... కేంద్రంలో అధికారం చేప‌ట్టిన న‌రేంద్ర మోదీ స‌ర్కారుకు దేశ రాజ‌ధాని ఢిల్లీకి అతి స‌మీపంలోనే ఉన్న ప‌శ్చిమ బెంగాల్‌లో ప‌రిస్థితులేమీ సానుకూలంగా క‌నిపించ‌డం లేదు. తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని అక్క‌డి రాష్ట్ర ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత‌ల‌కు షాకుల మీద షాకులిచ్చేస్తోంది. ఈ క్ర‌మంలో అప్ప‌టికే ఫిరాయింపు రాజ‌కీయాలకు గేట్లు బార్లా తెరిచేసిన బీజేపీ... దీదీని దారికి తెచ్చుకునేందుకు కూడా అదే మార్గాన్ని ఎంచుకుంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే దీదీ పార్టీలో కీల‌క నేత‌గానే కాకుండా యూపీఏ స‌ర్కారులో రైల్వే శాఖ మంత్రిగా ప‌నిచేసిన సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త ముకుల్ రాయ్‌పై వ‌ల విసిరింది. బీజేపీ విసిరిన వ‌ల‌కు ముకుల్ రాయ్ కూడా ఈజీగానే చిక్కేశారు.

చాలా వేగంగా పావులు క‌దిపిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా... నిన్న‌నే రాయ్‌కి త‌న పార్టీలోకి రెడ్ కార్పెట్ ప‌రిచారు. అయితే ప్ర‌జాస్వామ్యంపై కాస్తంత విశ్వాసం ఉన్న రాయ్‌.. తృణ‌మూల్ పార్టీ ద్వారా ద‌క్కిన రాజ్య‌స‌భ స‌భ్వ‌త్వానికి రాజీనామా చేసి ప‌డేశారు. అయితేనేం... బీజేపీలో చేర‌గానే ఆయ‌న‌కు బంప‌రాఫ‌ర్ ద‌క్కింది. దేశంలో అతి కొద్ది మంది ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే ద‌క్కే వై-ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త ఆయ‌న‌కు ద‌క్కేసింది. బీజేపీలో చేరిన 24 గంట‌లు తిర‌క్కుండానే రాయ్‌కి ఈ త‌ర‌హా భ‌ద్ర‌త ల‌భించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు రేగుతున్నాయి. అయినా రాయ్‌కి ఏం ప్ర‌మాదం ముంచుకొచ్చింద‌ని వై-ప్ల‌స్ భ‌ద్ర‌త కేటాయించార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

యూపీఏ హయాంలో రైల్వేశాఖ మంత్రిగా పని చేసిన ముకుల్‌ రాయ్ భాద్ర‌త కోసం ఇప్పటివరకూ.. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) సెక్యూరిటీ విధులు నిర్వహిస్తోంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆయనకు వై-ప్లస్‌ సెక్యూరిటీని కేటాయించడంతో.. సీఆర్‌పీఎఫ్‌ ఆర్మీ కమాండోలు సెక్యూరిటీ విధులు నిర్వహించనున్నారు. ముకుల్‌ రాయ్‌కి ఉగ్రవాదుల నుంచి ప్రాణహాని ఉందన్న నిఘా వర్గాల నివేదికతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సీఆర్‌పీఎఫ్‌ ఆర్మ్‌డ్‌ కమాండోలు ప్రస్తుతం దేశంలోని 70 మం‍ది వీఐపీలకు మాత్ర‌మే భద్రతను ఇస్తున్నాయి. ఎటువంటి అధికారిక పదవిలో లేని ముకుల్‌ రాయ్‌కి వై-ప్లస్‌ భద్రతను కల్పించడంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు సైనిక బలగాలను అవమానించేలా ఉన్నాయని తృణమూల్‌ వ్యాఖ్యానించింది.
Tags:    

Similar News