షాకింగ్ కామెంట్ః మాయ‌వ‌తి ఓ వేశ్య

Update: 2016-07-20 14:21 GMT
యూపీ బీజేపీ ఉపాధ్య‌క్షుడు ద‌యాశంక‌ర్ తీవ్ర వివాదాస్ప‌ద‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఎస్పీ అధినేత మాయావ‌తిని వేశ్య అని ఆరోపించారు. వ‌చ్చే ఏడాది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో అక్క‌డ రాజ‌కీయ వేడి ఎక్కువైంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ద‌యా శంక‌ర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ కాన్షీరామ్ ఆశ‌యాల‌ను మాయావ‌తి చిన్నాభిన్నం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. ఎవ‌రు ఎక్కువ డ‌బ్బు ఇస్తే వాళ్లకే ఆమె పార్టీ సీటు ఇస్తోంద‌ని త‌ద్వారా ఆమె ఓ వేశ్యలా ప్ర‌వర్తిస్తోంద‌ని ఆరోపించారు. ఈ వార్త‌లు మీడియాలో ప్ర‌సారం కావ‌డంతో క‌ల‌క‌లం రేగింది.

బీజేపీ నేత చేసిన వ్యాఖ్య‌ల‌పై మాయ‌వ‌తి తీవ్రంగా స్పందించారు. త‌న‌ను అంటే ఆయ‌న త‌న కూతురు - సోద‌రిని అన్న‌ట్లే అంటూ ఘాటుగా స్పందించారు. పార్ల‌మెంట్‌ లో అంద‌రూ త‌న‌ను సోద‌రిగా భావిస్తార‌ని, అలాంటి త‌న‌పై అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌తి సోద‌రిని అవ‌మానించిన‌ట్లేన‌ని అన్నారు. ఈ విష‌యంలో త‌న‌కు అండ‌గా నిలిచిన ప్ర‌తి ఒక్క‌రికీ మాయావ‌తి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ద‌ళితుల ప‌ట్ల బీజేపీ దారుణంగా వ్య‌వ‌హరిస్తోంద‌ని, ఒక‌వేళ ఆ పార్టీ ప్ర‌భుత్వంలో కొన‌సాగాల‌నుకుంటే ద‌ళితుల‌ను గౌర‌వించ‌డం నేర్చుకోవాల‌ని సూచించారు. ఈ విష‌యంలో జాతి బీజేపీని క్ష‌మించ‌ద‌ని ఆమె అన్నారు. ద‌యాశంక‌ర్‌ ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. అలా చేయ‌క‌పోతే ప్ర‌జ‌లే రోడ్ల‌పైకి వ‌చ్చి తిర‌గ‌బ‌డతార‌ని, హింస చెల‌రేగితే తాను చేయ‌గ‌లిగింది ఏమీ లేద‌ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో త‌మ పార్టీ బలపడుతోంద‌ని, దాని వ‌ల్లే బీజేపీ ఒత్తిడికి లోన‌వుతోంద‌ని, అందువ‌ల్లే ఆ పార్టీ నేత‌లు అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని మాయ‌వ‌తి అన్నారు.

బీజేపీ నేత చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది. ద‌ళితుల ప‌ట్ల బీజేపీ హేయంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని ఆప్ నేత ఒక‌రు ట్వీట్ చేశారు. బీజేపీ ఉపాధ్యకుడు చేసిన వ్యాఖ్యల పట్ల ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ మాట్లాడారు. దయాశంకర్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యల పట్ల సారీ చెప్పారు. అలాంటి ఆరోపణలు చేయడం తగదు అని పార్టీ చీఫ్ కేశవ్ మౌర్య అన్నారు. మాయావ‌తిపై  చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌భ ముక్తకంఠంతో ఖండిస్తోందని ఈ సంద‌ర్భంగా రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ పీజే కురియ‌న్ అన్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా ద‌యాశంక‌ర్ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌద‌రి మాట్లాడుతూ.. ఇలాంటి అస‌భ్య ప‌ద‌జాలం వాడిన ద‌యాశంక‌ర్‌ ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. మాయావ‌తి మాట్లాడ‌టం ముగిసిన త‌ర్వాత ఈ అంశంపై స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. సభ్యులు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌ లోకి దూసుకెళ్లారు. దీంతో కురియ‌న్ స‌భ‌ను రేప‌టికి వాయిదా వేశారు.
Tags:    

Similar News