డీడీ న్యూస్ దుమ్ము రేపుతోందిగా!

Update: 2017-06-27 03:58 GMT
డీడీ న్యూస్ గా మ‌నకు తెలిసిన దూర‌ద‌ర్శ‌న్ వార్తా ఛానెల్ ఇప్పుడు నిజంగానే దుమ్ము రేపుతోంది. కేంద్ర స‌మాచార‌ - ప్ర‌సార శాఖ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఈ ఛానెల్‌ లో ఎప్పుడూ ప్ర‌భుత్వానికి అనుకూల‌మైన వార్త‌లే వ‌స్తాయ‌ని, ప్ర‌భుత్వం చెప్ప‌ద‌ల‌చుకున్న విష‌యాలు మాత్ర‌మే ప్ర‌సార‌మ‌వుతాయ‌ని, వాస్త‌వాలు ఎప్పుడు ఆ ఛానెల్‌ లో వ‌చ్చిన దాఖ‌లాలే లేవ‌ని మ‌నం ఆ ఛానెల్‌ కు ఓ ముద్ర వేసిన సంగ‌తి తెలిసిందే. ఎంత ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్నా... తాను కూడా ఆస‌క్తిక‌ర క‌థ‌నాల‌తో పాటు ప్ర‌భుత్వం అనుమ‌తిస్తే ప్రైవేట్ న్యూస్ ఛానెళ్ల‌కు తీసిపోని రీతిలో వార్త‌ల‌ను ప్ర‌సారం చేయ‌గ‌ల‌న‌ని కూడా ఆ ఛానెల్ నిరూపించింది. ప్ర‌స్తుతం జాతీయ ఛానెళ్ల‌లో అత్య‌ధిక మంది వీక్షిస్తున్న వార్తా ఛానెల్‌ గా డీడీ న్యూస్ రికార్డుల‌కెక్కింది.

అయితే ఆ ఛానెల్ ప్ర‌సారం చేస్తున్న వార్త‌లు ఏ కోవ‌కు చెందిన‌వ‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... మంచి న్యూస్‌ నే ఆ ఛానెల్ ప్ర‌సారం చేస్తోంది కాబ‌ట్టే... జ‌నం ఆ ఛానెల్‌ ను చూస్తున్నార‌ని, దీంతోనే ఆ ఛానెల్ మిగిలిన అన్ని ప్రైవేట్ న్యూస్ ఛానెళ్ల కంటే కూడా ముందు వ‌రుస‌లో ఉంద‌ని ఒప్పుకోక త‌ప్ప‌దు. ఎందుకంటే తాజాగా వెలువ‌డిన టెవిలిజ‌న్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్పీ) విష‌యానికి వ‌స్తే... ఆ ఛానెల్‌కు ద‌రిదాపుల్లో కూడా టీఆర్పీని సాధించిన ప్రైవేట్ ఛానెళ్లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. బ్రాడ్‌ కాస్ట్ ఆడియ‌న్స్ రీసెర్చీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బార్క్‌)  తాజాగా వెల్ల‌డించిన గ‌ణాంకాల్లో డీడీ న్యూస్ స‌త్తా చాటింది.

డీడీ న్యూస్ ఇంగ్లీష్ ఛానెల్‌ కు ఈ గ‌ణాంకాల్లో ఏకంగా 34.2 శాతం మేర టీఆర్పీ రేటింగ్ వ‌చ్చింది. ఇక ఈ న్యూస్ ఛానెల్‌ ను వీక్షిస్తున్న వారిలో అత్య‌ధికులు వెల్ ఎడ్యుకేటెడ్ పీపులే ఉన్నార‌ని కూడా బార్క్ వెల్ల‌డించింది. స‌ర్కారీ ఛానెల్ అని పేరున్న ఈ ఛానెల్‌ ను చూస్తున్న వారిలో అత్య‌ధికులు సంప‌న్నులేన‌న్న వాస్త‌వాన్ని కూడా బార్క్ మ‌న ముందు పెట్టేసింది. ఈ ఛానెల్ వార్త‌ల‌ను వీక్షిస్తున్న వారిలో ఎక్కువ మంది యువ‌కులేన‌ట‌. 34.2 శాతం మేర టీఆర్పీ రేటింగ్ ను సాధించిన డీడీ న్యూస్‌... ఇత‌ర ఆంగ్ల వార్తా ఛానెళ్ల‌ను అంద‌నంత ఎత్తుకు ఎదిగిపోయింది.

ఇక ఆంగ్ల వార్త‌ల‌కు సంబంధించి దేశంలో జ‌నం బాగా చూస్తున్న టైమ్స్ నౌ ఛానెల్ కు కేవ‌లం 28.2 శాతం టీఆర్పీ మాత్ర‌మే వ‌చ్చింద‌ట‌. అదే స‌మ‌యంలో కొత్త‌గా తెర‌పైకి వ‌చ్చి సంచ‌ల‌న క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేస్తున్న రిప‌బ్లిక్ టీవీకి కేవ‌లం 17.9 శాతం టీఆర్పీ రేటింగే వ‌చ్చింద‌ట‌. ఈ లెక్క‌న చూస్తుంటే... భ‌విష్య‌త్తులో డీడీ న్యూస్ ఛానెల్ ప్రైవేట్ న్యూస్ ఛానెళ్ల‌ను దీటుగా వార్త‌ల‌ను ప్ర‌సారం చేయ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News