హైదరాబాద్ శివారులో అతని మొండం దొరికింది

Update: 2022-01-14 04:55 GMT
ఒక మతి స్థిమితం లేని వ్యక్తిని దారుణంగా హత్య (బలి?) చేసి.. అతడి తలను కాళిక అమ్మవారి కాళ్ల వద్ద పడేసిన వైనం పెను సంచలనంగా మారటం తెలిసిందే. దీనికి సంబంధించిన మొండెం ఎక్కడ? అన్నది గడిచిన కొద్ది రోజులుగా పోలీసులు వెతుకుతున్నారు. నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ హత్య మిస్టరీ వీడింది. తలకు సంబంధించిన మెండెం తాజాగా దొరికింది. హైదరాబాద్ శివారులోని తుర్కయాంజల్ లోని ఒక భవనంపైన హతుడి మొండెంలభ్యమైంది.

మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నాగార్జున సాగర్ - హైదరాబాద్ నేషనల్ హైవే పక్కనే ఉన్న విరాట్ నగర్ కాలనీ మెట్టు మహంకాళీ అమ్మవారి విగ్రహం వద్ద.. మొండెం లేని తలను ఉంచటం తెలిసిందే. ఎవరో దురాశతో బలి ఇచ్చినట్లుగా భావించారు. సోషల్ మీడియాలో ఈ తలను పెట్టిన పోలీసులు.. మరణించింది 30 ఏళ్ల జైహింద్ నాయక్ గా గుర్తించారు. మతి స్థిమితం లేని అతడిది సూర్యాపేట జిల్లా పాకలవీడు మండలం శూన్యపహాడ్ గ్రామంగా గుర్తించారు.

ఈ దారుణ హత్యను ఎందుకు చేశారు? అన్న విషయాన్ని తేల్చేందుకు ఎనిమిది పోలీసు టీంలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మరణించిన వ్యక్తికి సెల్ ఫోన్ లేకపోవటంతో.. చివరి సారి అతన్ని చూసిన వారు లేకపోవటంతో.. ఈ హత్య కేసు ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి వేళ.. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి రంగంలోకి దిగారు. హైదరాబాద్ - సాగర్ రోడ్డులోని తుర్కయాంజల్ నుంచి కొండేమల్లేపెల్లి వరకు సమారు 80కి.మీ. మేర ప్రతి సెంటర్ లో సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

 ఈ క్రమంలో జైహింద్ నాయక్ కొంతకాలంగా తుర్కయాంజ్ లో ఉన్నట్లుగా సమాచారం అందింది.దీంతో తనిఖీల్ని నిర్వహించగా.. ఒక భవనంపైన జైహింద్ నాయక్ మొండెం లభించింది.తాజాగా లభించిన మొండెం పడిఉన్న ప్రదేశం లో గడిచిన నాలుగైదు రోజుల్లో సదరు స్పాట్ నుంచి వెళ్లిన అవుట్ గోయింగ్.. ఇన్ కమింగ్ కాల్స్ లాంటివి ట్రేస్ చేయటం ద్వారా నిందితులను పట్టుకునే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా ఈ దారుణ హత్య మిస్టరీ త్వరలోనే తీరుతుందని పోలీసులు చెబుతున్నారు.
Tags:    

Similar News