అమెరికాలో మారిన కరోనా మరణాల లెక్క..!

Update: 2020-05-03 17:30 GMT
ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా కొందరు సెలబ్రిటీలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన అందచందాలతో కోట్లాదిమంది మనసుల్ని దోచేసిన ముద్దుగుమ్మల్లో పాప్ సింగర్ మడోన్నా ఒకరు. తాజాగా ఆమెను కరోనా మహమ్మారి వదల్లేదు. తనకు కరోనా పరీక్షలో పాజిటివ్ గా వచ్చిందన్న వార్తను వెల్లడించటం ద్వారా కోట్లాది మందికి షాకిచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా కారణంగా ఇప్పటికే వేలాదమంది మరణించటం తెలిసిందే. అగ్రరాజ్యానికి పీడకలలా చెప్పుకునే వియత్నాం యుద్ధ సమయంలో కోల్పోయిన మరణాలకు మించిన రీతిలో కరోనా మరణాలు ఉంటాయన్న అంచనాలు వ్యక్తం కావటం తెలిసిందే. దాదాపు లక్ష మంది అమెరికన్లు కరోనా కారణంగా మరణిస్తారన్న అంచనాల్ని ఆ దేశాధ్యక్షుడు ట్రంపే స్వయంగా ప్రకటించారు.

తాజాగా తాను చెప్పిన లెక్కను మార్చారాయన. తాజాగా వెలువడుతున్న అంచనాల ప్రకారం.. అమెరికాలో కరోనా మరణాలు 70వేలకు మించే అవకాశం లేదంటున్నారు. శనివారం అమెరికాలో కరోనా కారణంగా 1744 మంది ప్రాణాలు కోల్పోయారు. మన్ హట్టన్ లోని ఇసబెల్లా జెరియాట్రిక్ సెంటర్ నర్సింగ్ హోంలో ఒక్కరోజులోనే 98 మంది మరణించటం షాకింగ్ గా మారింది.

మరో కీలక అంశం ఏమంటే.. కరోనా కారణంగా న్యూయార్క్ మహానగరంలో ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లు..కాలేజీలు తెరిచే అవకాశం లేదని ఆ రాష్ట్ర గవర్నర్ స్పష్టం చేశారు. ఇప్పటికే కరోనా కారణంగా విద్యా సంవత్సరంపై పలు భయాలు ఉన్నాయి. ఇలాంటివేళ.. న్యూయార్కు గవర్నర్ చేసిన ప్రకటన ఆ రాష్ట్ర ప్రజల్లో నిరుత్సాహాన్ని నింపేసిందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News