డిసెంబ‌రు 11 - తెలంగాణ త‌ల‌రాత‌ను మార్చే రోజు

Update: 2018-12-08 13:14 GMT
తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత జరిగిన తొలి ఎన్నిక‌లు ఇవి. 2014 ఎన్నిక‌లు ఉమ్మ‌డి రాష్ట్రంలో జ‌రిగాయి. కాబ‌ట్టి వీటిని టెక్నిక‌ల్‌గా తొలి ఎన్నిక‌లు గానే భావించాలి. తొలి తెలంగాణ ప్ర‌భుత్వంపై అభిప్రాయం వ్య‌క్తీక‌రించ‌డంలో ఓట‌ర్ల‌కు ఏఏ ప్రాథ‌మ్యాలు ఉన్నాయో.. భ‌విష్య‌త్తులో తెలంగాణ ఓట‌రు ఎలా న‌డుచుకుంటాడో కూడా తెలిపే ఎన్నిక‌లు ఇవి. ఈ ఫలితాలు కేవ‌లం పార్టీల‌పైనే కాదు... మొత్తం తెలంగాణ భ‌విష్య‌త్తు - వ్యాపార వ్య‌వ‌హారాల‌నే ప్ర‌భావితం చేస్తాయి. అందుకే వీటిని ఏ ఇత‌ర రాష్ట్ర ఎన్నిక‌ల‌తో పోల్చ‌లేం. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం అన్ని పార్టీల వ్య‌వ‌హార శైలి - భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌లు మార‌బోతున్నాయి. ఆంధ్రుల‌తో తెలంగాణ వ్య‌వ‌హారం కూడా కొత్త మ‌లుపు తీసుకోవ‌డానికి ఇవి కార‌ణం కాబోతున్నాయి. అందుకే ఈ ఎన్నిక‌లు అత్యంత ప్ర‌ధాన‌మైన‌విగా చెప్పాలి.

ఒక వేళ ప్ర‌జాకూటమి అధికారంలోకి వ‌స్తే ఆంధ్రులు - ఇత‌ర సెటిల‌ర్ల విష‌యంలో అన్ని పార్టీలు పున‌రాలోచ‌న‌లో ప‌డ‌తాయి. రాబోయే ఎన్నిక‌ల‌కు పార్టీ ప్ర‌ణాళిక‌లు మార‌తాయి. జ‌నం దృక్కోణం - పార్టీల దృక్కోణం మారుతుంది. అదే టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌స్తే... ఆంధ్రుల విష‌యంలో అపుడు ఇంకోర‌క‌మైన ఆలోచ‌న ఉండొచ్చు. బ‌హుశా ప్ర‌స్తుత వాతావ‌ర‌ణం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఆమోద‌నీయంగా ఉన్న‌ట్టు అనుకోవాలి. హైద‌రాబాదు అంద‌రికీ మ‌రింత అనుకూల ప్ర‌దేశంగా మారే అవ‌కాశం ఉంది. రెండు రాష్ట్రాల సంబంధాలు ఇంకా బ‌ల‌ప‌డొచ్చు. ఒక‌వేళ న‌గ‌రంలో టీఆర్ ఎస్ విఫ‌ల‌మై - గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్కువ సీట్లు సంపాదిస్తే దాని ప్ర‌భావం ఇంకో ర‌కంగా ఉండే అవ‌కాశం ఉంది. ఇలా రాబోయే ఫ‌లితాలను బ‌ట్టి ప‌రిస్థితులు అనూహ్య‌మైన మ‌లుపులు తీసుకునే అవ‌కాశం ఉంది.

ఇక సంక్షేమ ప‌థ‌కాల వెల్లువ‌ను చూస్తే... రాష్ట్ర పాల‌నా తీరులో కూడా భారీ మార్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌జాకూట‌మి సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో గ‌తంలో ఎన్న‌డూ లేన‌న్ని కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించింది. బ‌హుశా ఇంత విలువైన ప‌థ‌కాలు ఈనాటి వ‌ర‌కు ఏ రాష్ట్రమూ ఇవ్వ‌లేదు. ఈ ప‌థ‌కాల‌న్నీ క‌చ్చితంగా మ్యానిఫెస్టో ప్ర‌కారం అమ‌లు చేస్తే వీటి విలువ 85 వేల కోట్లు. అంటే రాష్ట్ర బ‌డ్జెట్‌లో సంక్షేమ ప‌థ‌కాల‌కే 60 శాతం నిధులు కేటాయిస్తే... మౌలిక స‌దుపాయాలు - ప్రాజెక్టులు - జీతాలు - ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ - ప్ర‌త్యేక ప‌రిస్థితుల ఖ‌ర్చు - వివిధ శాఖల వారీ నిర్వ‌హ‌ణ ఇవ‌న్నీ అప్పు లేకుండా సాధ్య‌ప‌డాలంటే... రాష్ట్రానికి 2 ల‌క్ష‌ల కోట్ల ఆదాయం ఉండాలి. ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా ఇదే ప‌రిస్థితి.  అది ఏ మేర‌కు సాధ్య‌మ‌వుతుంది అన్న‌ది పెద్ద ప్ర‌శ్నే. ఓ రెండు మూడు ప‌థ‌కాలు మిన‌హా ఇరు కూట‌ముల ప‌థ‌కాలు దాదాపు ఒకటే ర‌క‌ర‌మైన భారాన్ని ప్ర‌భుత్వ ఖ‌జానాపై వేయ‌నున్నాయి. అందుకే వ‌చ్చే ప్ర‌భుత్వానికి ఖ‌ర్చుల ప‌ద్దు త‌ల‌కుమించిన భారం.

వీటిని స‌క్ర‌మంగా అమ‌లు చేస్తే ఒక స‌మ‌స్య‌. చేయ‌క‌పోతే ఇంకొక స‌మ‌స్య‌. అందుకే ఫ‌లితాల వ‌ర‌కు ఒక‌ర‌క‌మైన ఉత్కంఠ‌. ఫ‌లితాల అనంత‌రం తొలి బ‌డ్జెట్ ప్ర‌క‌ట‌న వ‌ర‌కు ఒక ర‌క‌మైన ఉత్కంఠ‌. ఏదేమైనా రాబోయే ఫ‌లితాలు తెలంగాణ త‌ల‌రాత‌ను మార్చ‌నున్నాయి.


Tags:    

Similar News