‘బోఫోర్స్’పై అమెరికా రహస్య పత్రాలు చెప్పిందిదే

Update: 2017-01-26 04:50 GMT
అప్పుడెప్పుడో జరిగిపోయి.. ముగిసిందనుకున్న బోఫోర్స్ భూతం మళ్లీ నిద్ర లేచింది. ఇప్పటికే గాంధీ ఫ్యామిలీని ఎంతగా దెబ్బ తీయాలో ఈ కుంభకోణం అంతలా దెబ్బేసింది. రాజీవ్ గాంధీ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేయటమే కాదు.. గాంధీ ఫ్యామిలీ చేసిన పాపాలకు నిలువెత్తు నిదర్శనంగా పలువురు బోఫోర్స్ ఉదంతం గురించి చెబుతుంటారు. దీనికి తగ్గట్లే తాజాగా బయటకు వచ్చిన అమెరికా రహస్య పత్రాలు ఇప్పుడు మరోసారి కలకలం రేపుతున్నాయి. కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ బయటకు వచ్చిన ఈ ఉదంతం కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టటమేకాదు.. ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా విడుదలైన అమెరికా గూఢచర్య సంస్థ అయిన సీఐఏ బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించిన అంశాల్ని బయటకు తీసుకొచ్చింది. ఈ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం.. రాజీవ్ గాంధీకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే ఈ వ్యవహారంపై స్వీడన్ ప్రభుత్వం దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిన సంచలన విషయాన్ని వెల్లడించింది.

1980లలో బయటపడిన ఈ కుంభకోణం అప్పట్లో పెను సంచలనమైంది. రాజీవ్ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసింది. భారత్ కు 410 శతఘ్నులను సరఫరా చేయటానికి ఉద్దేశించిన ఒప్పందంలో (150 కోట్ల డాలర్ల డీల్) ముడుపుల భాగోతం బాగానే జరిగిందని.. ఈ ఒప్పందం చేసుకున్నందుకుగాను స్వీడన్ సంస్థ రాజీవ్ కు.. మరికొందరికి ముడుపులు చెల్లించినట్లుగా పేర్కొంది. దీనికి సంబంధించిన రహస్య నివేదికను 1988లో అమెరికా గూఢాచార సంస్థ తయారు చేసింది. దీనికి సంబంధించిన నివేదిక తాజాగా బయటకు వచ్చింది.

సీఐఏ నివేదిక ప్రకారం.. ‘‘నేరుగా కానీ మధ్యవర్తులతో కానీ భారత అధికారులకు ముడుపులు అందినట్లు కచ్ఛితంగా చెప్పొచ్చు. దీనిపై జరిగిన దర్యాప్తును రాజీవ్ గాంధీ కోసం నిలిపివేశారు. ఆయన 1988లో స్వీడన్ పర్యటించారు. అనంతరం దీనిపై విచారణను నిలిపివేశారు. ముడుపులు తీసుకున్న అధికారుల పేర్లు వెల్లడై రాజీవ్ కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తకూడదన్న ఉద్దేశంతో స్వీడన్ విచారణను నిలిపి వేసింది. పైకి మాత్రం స్విస్ బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన చెల్లింపుల గురించి కూపీ లాగటంలో ఉన్న ఇబ్బందులు ఉన్నట్లుగా చెప్పింది’’ అని చెప్పింది. ఈ వివరాలు గాంధీ కుటుంబాన్ని మరోసారి ఆత్మరక్షణలోకి పడేయటం ఖాయమని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News