ఆర్మీ 'య‌తి' పై.. సైంటిస్ట్ ల రియాక్ష‌న్ ఇదే!

Update: 2019-05-02 05:05 GMT
పురాణాల్లోనూ.. కాల్ప‌నిక క‌థ‌ల్లో మాత్ర‌మే క‌నిపించే మంచు మ‌నిషి య‌తికి సంబంధించి భార‌త ఆర్మీ చేసిన ట్వీట్ ఆస‌క్తిక‌రంగానే కాదు.. కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది. హిమాల‌యాల్లో భార‌త ఆర్మీ సైనికులు య‌తి అడుగుజాడ‌ల్ని చూసిన‌ట్లుగా పేర్కొంటూ ఒక ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఉదంతం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. శాస్త్ర‌వేత్త‌ల మెద‌ళ్ల‌కు కొత్త ప‌నిని పెట్టిన‌ట్లైంది.

భార‌త ఆర్మీ పోస్ట్ చేసిన య‌తి ఫోటోల‌పై పెద్ద ఎత్తున జ‌రుగుతున్న చ‌ర్చల్లోకి శాస్త్ర‌వేత్త‌లు ఎంట్రీ అయ్యారు. అయితే.. వారి మాట‌ల‌న్ని ఆర్మీ చెప్పిన మాట‌ల‌కు భిన్నంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. భార‌త ఆర్మీ ప్ర‌క‌టించిన అంశంపై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని బాంబే నేచుర‌ల్ హిస్ట‌రీ సొసైటీ డైరెక్ట‌ర్ దీప‌క్ ఆప్టే వ్యాఖ్యానించారు.

ప్ర‌కృతిలో అప్పుడ‌ప్పుడు ఇలాంటి వింత ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయ‌న్నారు. కానీ.. బ‌ల‌మైన శాస్త్రీయ ఆధారాలు దొరికే వ‌ర‌కూ ఇలాంటి వాటిని నిర్ధ‌రించ‌టం స‌రికాద‌న్నారు. వీటిపై మ‌రింత ప‌రిశోధ‌న‌.. చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అంత‌రించిపోతున్న జంతువుల‌పై ఈ సంస్థ పెద్ద ఎత్తున ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హిస్తోంది.

ఇదిలా ఉంటే.. వాన‌ర జాతిపై విస్తృతంగా రీసెర్చ్ చేసే నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ స్ట‌డీస్ ఆచార్యులు సిన్హా స్పంద‌న మాత్రం భిన్నంగా ఉంది. ఆర్మీ పోస్ట్ చేసిన‌ ఫోటోల్లోని అడుగులు య‌తివ‌న్న వాద‌న‌తో తాను ఏ మాత్రం ఏకీభ‌వించ‌న‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

హిమాల‌యాల్లో తిరిగే గోధుమ రంగు ఎలుగు బంట్ల పాద‌ముద్ర‌లు కూడా ఇదే రీతిలో ఉంటాయ‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. అవి ఒక్కోసారి కేవ‌లం వెనుక పాదాల‌తో మాత్ర‌మే న‌డుస్తాయి. ఆ క్ర‌మంలోనే ఈ పాద‌ముద్ర‌లు అక్క‌డ ఉండి ఉండొచ్చ‌న్నారు. ఆర్మీ చెప్పిన య‌తి ప్ర‌స్తావ‌న‌పై ప‌లువురు నిపుణులు కొట్టిపారేయ‌టం విశేషం. వీరి వాద‌న‌ల‌కు తోడు.. ఈ ఫోటోలో ఒక కాలి అడుగులు మాత్ర‌మే ఉండ‌టంపైనా ప్ర‌శ్న‌లు లేవ‌నెత్త‌టం మొద‌ట్నించి ఉన్న‌దే.


Tags:    

Similar News