వైసీపీ సర్కార్ వల్లే లేటు : పోలవరానికి కొత్త డేట్?

Update: 2022-07-19 12:58 GMT
ఏపీకి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గా ఉన్న పోలవరం ఎపుడు పూర్తి అవుతుంది అని అడగరాదు. ఎందుకంటే దానికి జవాబు దొరకదు. డేట్స్ అలా మారిపోతూంటాయి. జాతీయ ప్రాజెక్ట్ గా దీన్ని ప్రకటించారు కానీ కేంద్రం నుంచి రాష్ట్రప్రభుత్వం దీన్ని చేతుల్లోకి తీసుకుంది.

దాంతో కేంద్ర పెద్దలకు పని సులువు అయిపోయింది. ముందు మీరు డబ్బులు ఖర్చు పెట్టండి మేము రీఅంబర్స్ చేస్తామని చెప్పి ఇప్పటికి పదకొండు వేల కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చారు. ఇక 2018 నాటికి సవరించిన అంచనాల మేరకు 55వేల కోట్లు పోలవరానికి ఖర్చు అవుతాయని చెప్పినా కేంద్రం మాత్రం 2014 నాటి అంచనాకే కట్టుబడి ఉంటామని చెబుతోంది.

ఇక నిర్వాసితుల గోడు కానీ వారి పునరావాసానికి అయ్యే ఖర్చు కానీ తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో పోలవరం ఎపుడు పూర్తి అవుతుంది అంటే ఆ మాటే అడగవద్దు అన్నారు ఏపీకి కొత్తగా వచ్చిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇపుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా పోలవరం విషయంలో ఏమీ అడవద్దు అంటూనే 2024 నాటికి పూర్తి అయితే అవుతుంది అని పేర్కొనడం విశేషం. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇచ్చిన జవాబు ఇది.

అంతే కాదు పోలవరంలో జరిగిన జాప్యానికి రాష్ట్రప్రభుత్వ నిర్వాకమే ఒక కారణం అని కూడా కేంద్రం ఆరోపించడం కొసమెరుపు. ఏపీ సర్కార్ సరిగ్గా వ్యవహరించడంలేదని బురద జల్లేశారు.

ఏపీ సర్కార్ అసమర్ధత వల్లనే ఇలా జరుగుతోందని కూడా కేంద్రం చెప్పడం ఇక్కడ మరో కీలకమైన పాయింట్. ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణలో ఏపీ సర్కార్ వైఖరి పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని కూడా ఘాటు విమర్శలే చేశారు.

మొత్తానికి చూస్తే కేంద్రం నిధులు ఇవ్వడంలేదని, సవరించిన అంచనాలు ఆమోదించడంలేదని వైసీపీ సర్కార్ ఒక వైపు విమర్శలు చేస్తోంది. మరో వైపు చూస్తే కేంద్రం ఏపీ సర్కార్ అసమర్ధత వల్లనే పోలవరం పూర్తి కవడం లేదు అంటోంది. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అనుకుంటే రెండూ కరెక్ట్ అనే చెప్పాలి. మొత్తానికి ఏపీకి జీవనాడి, ఆంధ్రులకు ఆశాజ్యోతి లాంటి పోలవరం ఇప్పట్లో పూర్తి కాదు అని తేలిపోతున్న విషయం. కేంద్రం 2024 అని కొత్త డేట్ ఇచ్చేసింది. కానీ అప్పటికి కూడా పూర్తి అవుతుంది అని భ్రమలు ఎవరికైనా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరంతే.
Tags:    

Similar News