వాన నీటిలో మునిగిన ఢిల్లీ ఎయిర్ పోర్టు.. ఎందుకిలా? అసలు కారణం ఇదే

Update: 2021-09-12 03:43 GMT
ఆకాశానికి చిల్లు పడిందా? అన్న సందేహం కలిగేలా భారీ వర్షం దేశ రాజధాని ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒకటి కాదు రెండు కాదు 12 గంటల వ్యవధిలో ఏకంగా 12.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావటంతో మహానగరం అతలా కుతలమైంది. శనివారం ఉదయం ఐదున్నర గంటలకు మొదలైన భారీ వర్షం నాన్ స్టాప్ గా సాయంత్రం ఐదున్నర గంటల వరకు కొనసాగింది.

ఈ దెబ్బకు రోడ్లు.. అండర్ పాస్ లు.. ఆ మాటకు వస్తే.. ఢిల్లీ ఎయిర్ పోర్టు సైతం నీళ్లలో మునిగింది. భారీ వర్షాలతో మూడు విమాన సర్వీసుల్ని అధికారులు రద్దు చేయాల్సి వచ్చింది. మరో ఐదు సర్వీసుల్ని జైపూర్.. అహ్మదాబాద్ లకు మళ్లించారు. ఈ రోజు ఉదయానికి (ఆదివారం) ఎయిర్ పోర్టులో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పడిన వర్షం తీవ్రత గురించి చెప్పాల్సి వస్తే.. గడిచిన 46 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత వర్షం ఒక్కరోజులో పడింది.

గత ఏడాదితో పోలిస్తే ఈ వర్షపాతం రెట్టింపుగా చెబుతున్నారు. 1975లో ఒకే రోజులో నాన్ స్టాప్ గా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం కురవగా.. మళ్లీ ఇన్నాళ్లకు నాన్ స్టాప్ గా ఒకే రోజులో దాదాపు అంత వర్షపాతం నమోదైన పరిస్థితి. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. అండర్ పాస్ లో భారీగా చేరిన నీటిలో ఒక బస్సు చిక్కుకుపోయింది. అందులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి.. వారిని కాపాడారు.  ఢిల్లీ నుంచి మధురకు ఈ బస్సు వెళుతోంది. మరో ప్రాంతంలో టెంపో ట్రావెలర్ లో చిక్కుకున్న పద్దెనిమిది మంది ప్రయాణికుల్ని కాపాడారు. భారీ వర్షం కారణంగా రోజువారీ జీవితాలకు మహా ఇబ్బందిగా మారింది. లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. మొత్తంగా పన్నెండు గంటల పాటు కురిసిన నాన్ స్టాప్ వర్షం దేశ రాజధానిని గజగజలాడించిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News